calender_icon.png 5 December, 2024 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేకు సహకరించని ప్రజలు!

10-11-2024 01:29:13 AM

  1. తమ వ్యక్తిగత వివరాలు చెప్పేందుకు అనాసక్తి
  2. కొన్నిచోట్ల ఎన్యుమరేటర్లపై దాడి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9(విజయక్రాంతి): సమగ్ర కుటుంబ సర్వేలో విధులు నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్లు ఇక్కట్లు పడుతున్నారు. ప్రజలు సహకరించడం లేదని అధికారుల ఎదుట వాపోతున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, ఆశవర్కర్లు, మహిళా సంఘాల ఆర్పీలను ప్రభుత్వం ఇన్యుమరేటర్లుగా విధులు కేటాయించింది.

సర్వే కోసం కేటాయించిన కాలనీలోని ఇళ్లలోకి వారు వెళ్తున్న సందర్భంలో ప్రజలు సరిగా స్పందించడం లేదని తెలుస్తోంది. బస్తీల్లో ప్రజలు ఓమోస్త్తరుగా స్పందిస్తున్నప్పటికీ, ముఖ్యంగా కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు, సింగిల్ ఇళ్లు ఉన్న చోట ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. వివరాలు చెప్పేందుకు పలువురు నిరాకరిస్తున్నారు.

తమ వివరాలు ఎందుకు చెప్పాలని కొందరు దుర్భాషలాడుతున్న సంఘటనలు కూడా ఎదురవుతున్నట్లు ఎన్యుమరేటర్లు తెలుపుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే కోసం బంజారాహిల్స్‌లోని ఒక ఇంటికి వెళ్లిన ఇద్దరు మహిళా ఎన్యుమరేటర్లపైకి ఆ ఇంటి యజమానులు కుక్కలను వదిలినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎంబీటీ కాలనీలో ఒక ఇంటికి వెళ్లిన ఉపాధ్యాయురాలి పట్ల ఆ ఇంటి యజమాని అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లో సర్వేకు హాజరైన ఒక ఉపాధ్యాయుడికి కేటాయించిన ఇండ్లలో 50మంది కూడా స్థానికంగా లేరని సర్వే చేసేదెలా అని వాపోయాడు. ఇదే విషయాన్ని తమ పై అధికారులకు చెబితే ఎలాగైనా సర్వేను పూర్తి చేయాల్సిందేనని ఆదేశాలిచ్చారన్నారు. 

ఒక్కో ఇంటికి అరగంట సమయం

సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇచ్చిన ఫామ్‌లో  ప్రతి అంశానికి ఒక్కో కోడ్ ఉంది. ఆ కోడ్ ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ఆ వివరాలన్నిం టినీ నమోదు చేసేందుకు దాదాపు అరగంట నుంచి  45 నిమిషాల వరకు సమ యం పడుతోందని తెలుస్తోంది. అయితే ఈ కోడ్‌లకు సంబంధించిన కాపీని కూడా ఇవ్వలేదని సర్వేలో పాల్గొంటున్న ఎన్యుమరేటర్లు వాపోతున్నారు.

దీంతో ఫోన్‌లో చూసి కోడ్‌లను నమోదు చేయడం ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. కాగా ఉదయం 8:50కి పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు సర్వే ముగిశాక తిరిగి ఇండ్లకు వెళ్లేందుకు రాత్రి 9గంటల సమయం అవుతుందని చెబుతున్నారు. దీనికి తోడు పలు మండలాల్లో విద్యా శాఖ అధికారులు ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో తాము సమావేశానికి ఎప్పుడు హాజరు కావాలి, స్కూల్‌కు ఎప్పుడు వెళ్లాలి, సర్వేను ఎప్పుడు పూర్తిచేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సర్వేలో పాల్గొంటున్న మహిళా ఎన్యుమరేటర్లు  వారికి కేటాయించిన ఇండ్లకు ఒంటరిగా వెళ్లాలంటే భయపడుతున్నారు.