28-02-2025 10:33:02 AM
షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని శ్రీ సత్య సాయి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. నందిగామ మండలంలోని వీర్లపల్లి, చర్ల అంతిరెడ్డి గూడా, అప్పారెడ్డి గూడ గ్రామాలకు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు శుక్రవారం పాఠశాలకు వెళ్లడానికి ఆటోను ఆశ్రయించారు. రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో విద్యార్థులతో వస్తున్న ఆటోకు ఎదురుగా ఓ బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి రాంగ్ రూట్లో ఆకస్మికంగా రావడంతో ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆటో డ్రైవర్ పిచ్చకుంట్ల పాండు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు మరికొంతమంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి హుటాహుటిన విద్యార్థులను ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హుటాహుటిన దావాఖానకు చేరుకొని ఘటన గురించి ఆరా తీసి... విద్యార్థులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.