calender_icon.png 6 October, 2024 | 1:34 AM

రేవంత్ పాలనలో ప్రజల పాట్లు

05-10-2024 12:08:01 AM

రైతన్నలను మోసం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన రైతు రుణమాఫీ దీక్షలో బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ 

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 4 (విజయక్రాంతి): పరిపాలన అనుభవం లేని సీఎం రేవంత్‌రెడ్డి తీరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పడరాని పాట్లు పడాల్సి వస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్ల రైతు సహకార సంఘం ఎదుట చేపట్టిన రైతు రుణమాఫీ దీక్షకు శుక్రవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం వంటి ప్రాంతాల్లోని ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదని.. గ్రామీణ ప్రాంత రైతులు, కూలీలు నమ్మి ఓటేస్తే వారినే మోసం చేసిన దుర్మార్గుడు సీఎం రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు రూ.36 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, కేవలం 22 లక్షల మందికి రూ.18 వేల కోట్లు మాఫీ చేసి అందరికీ చేశామని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ కాని 60 శాతం మంది రైతులకు వెంటనే వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు.

చందుపట్ల సొసైటీలో జరిగిన అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని, వెంటనే విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2,900 మంది రైతులకు రూ.42 కోట్లు రుణమాఫీ కాలేదన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్క ర్ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మహేందర్ గుప్తా, సురేశ్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు,  అశోక్, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.