సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కొత్తపల్లి, జనవరి 23 (విజయ క్రాంతి): ప్రజలందరూ ఓపికతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు. గురువారం కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన ఇందిరమ్మ గ్రామసభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.
వ్యవసాయం చేసే రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని, రైతు కూలీలకు సైతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12 వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. గతంలో పాలించిన టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాళ్లు రప్పలు, వ్యవసాయ యోగ్యత లేని భూములకు, కొండలకు, గుట్టలకు రైతు భరోసా ఇచ్చారని ఆరోపించారు. ఇందులో నిజమైనటువంటి రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.
ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూములు ఇస్తామని ఆనాడు కేసీఆర్ ఘోరంగా ప్రజలను మోసం చేసి వంచించారన్నారు. దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులను చెల్లిస్తామని చెప్పారు. పూర్తిగా స్థలం లేని వారికి ఏం చేయాలని ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రజలందరూ ఎవరు ఆందోళన చెందకుండా ఓపికతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను దరఖాస్తు చేసుకొని సంక్షేమ ఫలాలను పొందాలని పిలుపునిచ్చారు.
గత బి ఆర్ ఎస్ పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. టిఆర్‌ఎస్ దొంగల ముఠా లక్షల కోట్లు దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. అందుకే ప్రజల్లో బిఆర్‌ఎస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందని చెప్పారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధికంగా మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, ఏఈఓ సుచరిత,పంచాయతీ సెక్రటరీ మహేందర్, గ్రామశాఖ అధ్యక్షుడు దీకొండ శంకరయ్య, మాజీ ఎంపీటీసీ దోమటి అశోక్,యూత్ అధ్యక్షుడు గంగయ్య, టెంపుల్ చైర్మన్ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.