calender_icon.png 26 December, 2024 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

08-11-2024 01:05:38 PM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ ఎం ఆర్ సునీత 

వనపర్తి (విజయక్రాంతి): ప్రజలకు ఉచిత న్యాయ సహాయం, సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని, కాబట్టి ఈ న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ ఎం ఆర్ సునీత విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా స్థానిక కోర్టు ప్రాంగణం నుంచి బస్టాండ్ వరకు న్యాయవాదులతో కలిసి ర్యాలీ నిర్వహించి న్యాయ సేవల వినియోగంపై అవగాహన కల్పించారు. కళాకారులతో పాటల ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్బంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయం అందరికి సమానమేనని, ధనిక, పేద, కులం మతం అనే తేడాలు లేవని తెలిపారు. న్యాయ సేవాధికార చట్టం పేదలకు, బాలలకు, మహిళలకు, కల్పిస్తున్న ఉచితన్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచిత న్యాయ సేవ, సలహాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ అథారిటీ సెల్ సెక్రటరీ రజని మాట్లాడుతూ.. ప్రజలకు ఉచిత న్యాయసేవలు అందించడం, సంక్షేమ చట్టాలు గురించి తెలియజేయడం, లోక్‌ అదాలత్‌ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించడం నాల్సా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆమె తెలిపారు.

చట్టం, న్యాయం దృష్టిలో ప్రతిఒక్కరూ సమానమేనన్నారు. ప్రతి ఒకరికి ఉచిత న్యాయ సేవలు, న్యాయ సలహాలు అందాలనే ఉద్దేశంతో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు.  కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి కవిత, జూనియర్ సివిల్ జడ్జి రవి కుమార్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జానకి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్, న్యాయవాదులు, న్యాయ సేవల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.