25 May, 2026 | 1:46 AM

ఎండ తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

25-05-2026 12:00 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, మే 24 (విజయక్రాంతి): జిల్లాలో మూరోజుల పాటు ఎండ తీవ్రతతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దన్నారు. అలాగే దాహం వేయకపోయినా తరచూ నీరు తాగాలన్నారు. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ లవణాల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చున్నారు. అదేవిధంగా బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలనీ, తలకు టోపీ, రుమాలు లేదా గొడుగు తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు.దీనికి సంబంధించిన పూర్తి విషయాలకి కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ 6281492368 నెంబర్ను సంప్రదించవచ్చు అన్నారు.