ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు...
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేసే పథకాల అర్హులైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) కోరారు. సోమవారం స్థానిక ప్రజా భవన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజుతో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ప్రభుత్వ పథకాలపై సర్వే పూర్తయిందని, మంగళవారం నుంచి లబ్ధిదారుల ఎంపిక నిర్వహించేందుకు ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ గ్రామసభల్లో స్థానిక ప్రజలు భాగస్వాములై అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో సహకరించాలని కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తమ పేర్లు లేవని ఎవరు ఆందోళన చెందవద్దని ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరం జరిగే ప్రక్రియని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సమావేశంలో శివాలయం పాలకమండలి చైర్మన్ కూచిపూడి బాబు, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు పీరినాకి నవీన్, సైదులు, నాయకులు సామా శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారెడ్డి, కోటేశ్వరరావు, సౌమ్య తరుణ్ రెడ్డి పాలమూరు రాజు తదితరులు పాల్గొన్నారు.