20-04-2025 09:36:57 PM
అడుగంటిన బోరు బావులు..
సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్..
కామారెడ్డి (విజయక్రాంతి): ఎండలు రోజురోజుకు తీవ్రమవుతుండడంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బోరు బావులు ఎండిపోయి ప్రజలకు త్రాగు నీటి కష్టాలు ఎక్కువ అయ్యాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్, అధికారులు ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చూడాలని కామారెడ్డి జిల్లా సిపిఎం పార్టీ తరపున కోరుతున్నట్లు తెలిపారు.
మంచినీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష సమావేశాలు నిర్వహించడం బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. గ్రామస్థాయి నుండి జిల్లా కేంద్రం వరకు ప్రజలు నీటి కోసం కష్టపడుతూనే ఉన్నారని, రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుందని అన్నారు. కామారెడ్డి పట్టణంలో నీరు దొరకక ఇండ్లకు తాళాలు వేసి గ్రామాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రామాలకు వెళ్తే ఆక్కడ సైతం నీటి కష్టాలే ఉంటున్నాయని, గ్రామాలలో బోరు బావులు సైతం ఎండిపోయి నీటికి ఇబ్బంది కలుగుతుందని, దీనిపై కలెక్టర్ సమగ్ర విచారణ చేసి ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట గౌడ్, మోతీరాం, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.