calender_icon.png 22 January, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దు

22-01-2025 04:52:20 PM

ఎమ్మెల్యే గడ్డం వినోద్...

బెల్లంపల్లి (విజయక్రాంతి): ప్రజలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) అన్నారు. బుధవారం తాండూరు మండలంలోని అచ్చులాపూర్ గ్రామంలో అధికారులు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ... రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుందని చెప్పారు. అధికారులు అర్హులైన లబ్ధిదారులు ప్రజా పాలన గ్రామసభలలో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వబోతుందని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను, అప్పులను సరి చేసుకుంటూ అర్హులైన ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. మొదటి దశలో సొంత స్థలం కలిగి ఇల్లు లేని నిరుపేదలకు రూ.ఐదు లక్షలతో ఇల్లు నిర్మించి ఇవ్వబోతున్నట్లు తెలిపారు. జనవరి 26 వరకు కొంతమందికి, తర్వాత దశలవారిగా సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ఎన్నికలలో ఇచ్చిన విధంగా రూ.24వేల కోట్లతో రూ.రెండు లక్షల వరకు రుణమాఫీని చేశామన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటును అర్హులకు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు అందించే ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీ సంస్థకు ప్రతి నెల ప్రభుత్వం రూ.300 కోట్లు చెల్లిస్తుందన్నారు. రూ.500 కే సబ్సిడీ గ్యాస్ అందిస్తున్నామని చెప్పారు.

అంతకుముందు తాండూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజలతో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి సులువుగా పాలన అందించేలా పథకాలకు రూపకల్పన చేశారన్నారు. గత ప్రభుత్వం చేయలేనటువంటి పనులన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిస్తుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని చూసి ఓర్వలేక కుటిల రాజకీయాలకు దిగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను గ్రామ సభల ద్వారా అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ సభలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్, తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సాలిగం బాలయ్య, సిరంగి శంకర్, సూరం రవీందర్ రెడ్డి, ఎండి వీసాలతో పాటు రెవెన్యూ, మండల పరిషత్, ఐకెపి ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.