వనపర్తి (విజయక్రాంతి): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా సర్వే చేయడానికి వచ్చే సిబ్బందికి అవసరమైన వివరాలతో ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విజ్ఞప్తి చేశారు. శనివారం సమగ్ర కుటుంబ సర్వే కీలక దశ నేటి నుంచి మొదలు కానున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమగ్ర కుటుంబ సర్వేను కలెక్టర్లు మానిటర్ చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. తప్పులు లేకుండా సర్వేను ముందుకు తీసుకెళ్లాలని భట్టి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా సర్వే చేయడానికి వచ్చే సిబ్బందికి అవసరమైన వివరాలతో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, సిబ్బందికి వివరాలు చెప్పాలన్నారు. ఇప్పటికే హౌస్ లిస్టింగ్ పూర్తి అయిందని, ఇక సర్వేలో ఎలాంటి పొరపాట్లు, తప్పులు లేకుండా వివరాలు సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్యూమరేటర్లకు ఎలాంటి అనుమానాలు ఉన్నా సూపర్వైసర్లతో సమన్వయము చేసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 1392 ఎన్యుమరేటర్ బ్లాక్ లలో, ఎన్యుమరేటర్లు కుటుంబ వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, ప్లానింగ్ శాఖ అధికారులు భూపాల్ రెడ్డి, ఖగవాన్, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, తహసీల్దార్లు రమేష్ రెడ్డి, కిషన్, తదితరులు పాల్గొన్నారు.