calender_icon.png 8 November, 2024 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేకు ప్రజలు సహకరించాలి

08-11-2024 12:53:52 AM

ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసమే సర్వే

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, నవంబర్ 7 (విజయక్రాంతి): ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సర్వేకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. గురువారం మంథని పట్టణంలోని సత్యసాయి నగర్‌లో రూ.75 లక్షలతో నిర్మించనున్న జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మంథని బ్రాంచీ భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్యాంకు భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం క్రమపద్ధతిలో చర్యలు తీసుకుంటుందన్నారు.

ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు లాంటి పథకాలను అమలు చేశామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తూ రూ.18వేల కోట్లకు పైగా నిధులను జమ చేశామన్నారు. సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించామన్నారు. గతంలో మాదిరిగా మిల్లుల వద్ద రైతులకు ఎలాంటి కోతలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు.

48 గంటల వ్యవధిలో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించే విధంగా చర్య లు తీసుకున్నామన్నారు. భవిష్యత్‌లో ప్రజల కోసం ప్రణాళికలు తయారు చేసేందుకు అంకెలు చాలా అవసరమనీ. ఇందు కోసం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినట్టు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ, మంథని మేనేజర్ ఉదయ శ్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.