కూకట్ పల్లి (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కులగణన సర్వేలో భాగంగా సోమవారం శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ అరెకపూడి గాంధీ నివాసానికి అధికారులు వచ్చి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన సర్వే నిర్వహించడం గొప్ప నిర్ణయం అన్నారు. సమగ్ర కుల గణన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుండి సమగ్ర కుటుంబ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ప్రజలు సర్వే ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు సర్వే విషయంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా సక్రమంగా నిర్వహించాలని సూచించారు.