03-04-2025 01:33:17 AM
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఈనెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు, మహాసభపై గులాబీ బాస్ కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించి కొన్ని రోజుల నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా జిల్లా నాయకులతో కేసీఆరే స్వయంగా సమావేశాలు నిర్వహిస్తూవస్తున్నారు.
ఇందులో భాగంగానే బుధవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహాసభ ఏర్పాట్లపై సమావేశంలో చర్చిం చారు. నియోజకవర్గానికి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలి వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని బీఆర్‌ఎస్ ముఖ్యనేతలకు కేసీఆర్ ఆదేశించారు.
మహాసభతో ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలన్నారు. మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని, ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలివస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని నేతలను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరుపుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 1న ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే.
బుధవారం జరిగిన సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు కే ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చింత ప్రభాకర్, మాణిక్ రావు, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు జైపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్‌కు చెందిన నేతలు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గణేశ్ గుప్తా, గంప గోవ ర్దన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు.