calender_icon.png 20 September, 2024 | 5:31 AM

పీవోకే ప్రజలూ.. మాతో కలవండి!

09-09-2024 12:00:00 AM

  1. భారత్ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటుంది 
  2. పాక్ గడ్డపై మీరు ఎప్పటికీ విదేశీయులే 
  3. జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదివారం రామ్‌బన్ నియోజకవర్గం లో బీజేపీ ప్రచారం నిర్వహించగా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లో నివసిస్తున్న ప్రజలు భారత్‌లో కలిసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పీవోకే వాసులను పాక్ విదేశీయులుగానే చూస్తోందని, తాము మాత్రం అక్కున చేర్చుకొని సొంత మనుషుల్లా చూస్తామన్నారు.

‘జమ్ముకశ్మీర్‌లో బీజే పీకి మద్దతిస్తే స్థానికంగా మరింత అభివృద్ధి చేస్తాం. మాకు పాకిస్థాన్‌తో కలిసి ఉండడం ఇష్టం లేదు.. భారత్‌కు వెళ్తామని పీవోకే ప్రజలే చెప్పేంతగా అభివృద్ధి పనులు చేపడతాం. పీవోకేను దాయాది దేశం విదేశీ భూభాగంగానే పరిగణిస్తోంది. అక్కడి సొలిసిటిర్ జనరల్ కూడా ఇదే విషయాన్ని ఇటీవల ఓ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కానీ భారత్ అలా కాదు.. సొంత మనుషులుగా చూస్తోం ది’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్  నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుపై సైతం కేంద్రమంత్రి విరుచుకుపడ్డారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు ఆర్టికల్ 370 రద్దు ఉండదని స్పష్టం చేశారు. ఎన్సీ ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతోందని మంత్రి మండిపడ్డారు. పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్‌గురుకు ఉరి శిక్ష వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ఒమర్ అబ్దుల్లా వెనుక ఆంతర్యమేంటని, అఫ్జల్ గురుకు ఉరిశిక్షకు బదులు పూలమాల వేయమంటారా అని ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్‌లోని 90 నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు విడుదల చేస్తారు.