అధిక వడ్డీ ఆశ చూపి..
- ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ పేరుతో మోసం
- సుమారు 4000 మంది బాధితులు
- బాధితులంతా ఒకే సామాజికవర్గానికి చెందినవారు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి) : నగరంలో మరో భారీ మోసం వెలుగు చూసింది. ‘ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి, డైరెక్టర్‌గా డాక్టర్ పీ కమలాకర్ శర్మ కొనసాగారు. ట్రస్ట్‌లో పెట్టు బడులు పెడితే కొందరికి స్థలాలు, మరికొందరికి తక్కువ సమయంలో అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి, ఒకే సామాజిక వర్గానికి చెందిన సుమారు 4,000 మంది బాధితుల నుంచి రూ. 514 కోట్లు పెట్టుబడులు పెట్టించాడు. అనంతరం పెట్టుబడు లుగా వచ్చిన డబ్బులతో భారీగా ఆస్తులను కొనుగోలు చేశాడు. బాధితులకు చెప్పిన సమయంలో డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో సుస్రాల నరసింహామూర్తి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు గత డిసెంబర్‌లో సీసీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు చైర్మన్ కమలాకర్ శర్మను అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో సోమవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో డీసీపీ శ్వేత సుమారు 200 మంది బాధితులతో సమావేశం నిర్వహించి కేసు దర్యాప్తు పురోగతిని వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసును నగర ఈఓడబ్ల్యూ టీమ్ సీసీఎస్ ఏసీపీ ఎల్.ఆదినారాయణ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటివరకు 1. అంబర్‌పేట్‌లోని డీఎఫ్‌ఐ హాస్పిటల్, 2. అంకపల్లి, వైజాగ్, 3. గన్నవరం, విజయవాడ, 4. సిద్దిపేట, 5. మిడ్జిల్ ప్రాంతాలలో కలిపి మొత్తం 450 ఎకరాల స్థలం, హైదరాబాద్ నడిబొడ్డున దాదాపు 3000 గజాల వాణిజ్య స్థలాన్ని ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ పేరుపై కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు.
డీఎఫ్‌ఐ, సంబంధిత కంపెనీలకు చెందిన సుమారు 30 ఖాతాలను ఫ్రీజ్ చేశామని, ధన్వంతరి పౌండేషన్ పేరు మీద ఉన్న నాలుగు ఆస్థులలో జీవోలను పొందామని, ఆస్తులను జప్తు చేసుకోవడానికి పూర్తి ఉత్తర్వుల కోసం మెట్రోపాలిటన్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు. మిగిలిన రెండు ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ప్రక్రియ పురోగతిలో ఉందని చెప్పారు. త్వరలోనే మొత్తం ఆస్తులను స్వాధీనం చేసుకొని వాటిని విక్రయించి బాధితులకు నగదు డిపాజిట్లు చెల్లించే ఏర్పాట్లు చేస్తామని బాధితులకు డీసీపీ హామీ ఇచ్చారు.