calender_icon.png 6 October, 2024 | 4:16 AM

ఆఫ్రికాలో 600 మంది ఊచకోత

06-10-2024 01:37:15 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినాఫాసోలోని బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగ ట్టారు. చిన్నాపెద్ద తేడా లేకుండా కాల్పులు జరిపి గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని పొట్టనబెట్టుకున్నారు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ అయిన జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ (జేఎన్‌ఐఎం) మిలిటెంట్లు ఈ ఘాతు కానికి పాల్పడ్డారు.

ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై ఉగ్రవాదులు దాడిచేసి కనిపించినవారిని కాల్చేశారు. బుర్కినాఫాసోలో మిలిటెంట్లు తరుచూ దాడులకు పాల్పడుతుండటంతో ప్రజల భద్రత దృష్ట్యా గ్రామా ల చుట్టూ లోతైన కందకాలు తవ్వుకోవాలని అక్కడి మిలిటరీ ఆదేశించింది. బార్సాలోగో ప్రజలు తవ్వకాలు జరుపుతున్నారు.

ఉగ్రవాదులు వారిని సైనికులుగా భావించి దాడికి తెగబడ్డారు. ప్రాణభయంతో పరుగులు పెట్టి నా వెంటాడి మరి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 200 మంది మరణించినట్లు ఐరాస అంచనా వేయగా, దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా గణాంకాలు వెలువడ్డాయి. మృతదేహాలను సేకరించటానికే 3 రోజుల సమయం పట్టిందని అధికారులు తెలిపారు.