calender_icon.png 19 April, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది

17-04-2025 12:23:37 AM

ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ఈ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా నష్టం చేసిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపెల్లి మండలంలోని మల్కాపూర్, బద్దిపల్లి గ్రామాలలో  డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం   ఎమ్మెల్యే ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలు పెట్టారని, కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరి కోతలు మొదలు కాలేదని, కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో  ఆలస్యంగా నాట్లు వేస్తారని, తద్వారా కోతకు రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అన్నారు.

అయితే ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో వరిపైరుకు చివరి తడి నీరు అందించాల్సిన అవసరం ఉండేదని కానీ.. ప్రభుత్వం నీరందించక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి  నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సీజన్లో ఎండిన వరి పంటకు    500 రూపాయల బోనస్ ను చెల్లించాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో  చివరి తడి వరకు నీరిచ్చామని, సమృద్ధిగా నీళ్లు ఉన్నందున వరి కోతలకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి  ఉండేదని తద్వారా ఆ రైతులు నీరు బంద్ చేయండి అని ఎన్నోసార్లు మాతో చెప్పుకునే  పరిస్థితి గతంలో నెలకొందని వారు గుర్తు చేశారు.

ఈ సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులనే నిండుకుండలా ఉండేవని, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా  నేడు వెలవెలబోతున్నాయన్నారు. రాను రాను పంట దిగుబడి తగ్గిపోతుందని,  ఈప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా  నష్టం చేస్తుందన్నారు. అదేవిధంగా తగినన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వచ్చిన ధాన్యాన్ని   వెంటనే కొనుగోలు చేసి, ఆయా రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లోనే  డబ్బులు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కరీంనగర్ నగర ప్రజలకు  త్రాగునీటికి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేనిచో ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర బిఆర్‌ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, బి ఆర్‌ఎస్ పార్టీ కొత్తపెల్లి మండల శాఖ అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, కొత్తపెళ్లి మండలం మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత -మహేష్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్,మాజీ జడ్పీ కో అప్షన్ సభ్యులు సాబీర్ పాషా, మాజీ  ఎంపీటీసిలు  పండుగ గంగమ్మ -నర్సన్న,  ఉప్పు శ్రీనివాస్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, మాజీ సూడా డైరెక్టర్ నేతి రవివర్మ, తదితరులు పాల్గొన్నారు.