ఆదిలాబాద్ (విజయక్రాంతి): జైనథ్ మండలంలోని పూసాయి గ్రామంలో గల రేణుకా మాత ఎల్లమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పూసాయి ఎల్లమ్మ జాతరకు ఆదిలాబాద్ తో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలోని వివిధ గ్రామాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలను ఆచరించిన భక్తులు అమ్మవారికి పిండి వంటకలతో నైవేద్యాలను సమర్పించారు. కోళ్లు, మేకలను బలి ఇచ్చి భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ ఐ పురుషోత్తం ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.