calender_icon.png 11 April, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన గురుకులంలో ౩౦ మందికి అస్వస్థత

11-12-2024 01:40:20 AM

తాండూరులో ఘటన.. చికిత్స పొందుతున్న 15 మంది విద్యార్థినులు 

వికారాబాద్, డిసెంబర్10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ వసతిగృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసి, నాణ్యమైన ఆహారం అందించేందుకు మార్గ దర్శకాలు విడుదలచేసినా ఆహారం వికటించి అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఆగట్లేదు.

తాజాగా మంగళవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరు గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం కిచిడి తిన్న కొద్దిసేపటికే విద్యార్థినులు వాంతులు చేసుకోవడంతోపాటు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. గమనించిన వసతిగృహ సిబ్బంది విద్యార్థినులకు ప్రాథమిక చికిత్స అందజేశారు.

వీరిలో ౧౫ మందిని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ ఫాయిజన్ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే వసతిగృహానికి వెళ్లి వారి పిల్లలను ప్రైవేటు క్లినిక్‌లకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఉదయం కిచిడి తిన్న వారిలో 15 మంది ఎక్కువ అస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు.

గత కొంతకాలంగా రాష్ట్రంలో తరచూ ఫుడ్‌పాయిజన్ ఘటనలు జరుగుతున్నా.. వసతిగృహాల సిబ్బంది తీరు మార్చుకోకుండా పురుగుల అన్నం, కలుషిత కూరలు వడ్డించడంతోనే ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

విద్యార్థులను సీఎం పట్టించుకోవడం లేదు

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విగ్రహాల మీద ఉన్న ధ్యాస గురుకుల విద్యార్థుల మీద లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న శ్రద్ద, పిల్లల భవిష్యత్తు మీద పెట్టడం లేదని దుయ్యబట్టారు.

మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రాష్ర్ట వ్యాప్తంగా కాకుండా కనీసం సొంత జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని సీఎంపై ఆయన మండిపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగి 15 మంది ఆసుపత్రి పాలయ్యారని పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే, రాష్ర్టవ్యాప్తంగా ఇంకెంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ర్టంలో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడక పోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయని ఎద్దేవా చేశారు. మాటలే తప్ప చేతలు లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరుతో ఇంకెంత మంది విద్యార్థులు ఆస్పత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోతారోనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.