calender_icon.png 5 April, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల చూపు బీఆర్‌ఎస్ వైపు

05-04-2025 02:32:37 AM

  1. కాంగ్రెస్ పాలనతో విసిగిన జనం
  2. గ్రేటర్ పరిధిలోనే బీఆర్‌ఎస్‌కు అధిక స్థానాలు
  3. వరంగల్ సభకు సింహభాగం ఇక్కడి నుంచి జనసమీకరణ
  4. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ముఖ్యనేతల సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్

హైదారబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తారని, ఇప్పుడు ప్రజలందరి చూపు బీఆర్‌ఎస్ వైపు ఉందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నందున ఈ నెల 27న జరిగే పార్టీ రజతోత్సవానికి ఈ ప్రాంతం నుంచే సింహభాగం ప్రజలను సమీకరించాలని దిశానిర్దేశం చేశారు.

వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ మహాసభ విజయవంతానికి ప్రతిరోజూ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్‌లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ శుక్రవారం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, బీ లక్ష్మారెడ్డి, డీ సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు, పార్టీ సీనియర్ నేత కల్వకుంట్ల వంశీధర్‌రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పదిలక్షల మందితో సభను భారీగా నిర్వహించబోతున్నట్టు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ప్రజలకిచ్చిన హామీలు అమలు విషయంలో పూర్తిగా విఫలమయ్యారని కేసీఆర్ విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళనతో ప్రజలను ఇబ్బందులు పెట్టారని, రైతులకు రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాలు అమలు చేయలేక చేతులు ఎత్తేశారని మండిపడ్డారు.

తాజాగా సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశం రేవంత్‌రెడ్డి సర్కార్‌కి చెడ్డపేరు తీసుకొచ్చిందని మాజీ సీఎం అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందని చెప్పారు. ప్రజల్లో రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోందని తెలిపారు.