calender_icon.png 31 January, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో పెను ప్రమాదం 67 మంది జలసమాధి

31-01-2025 12:57:43 AM

  1. వాషింగ్టన్‌లో విమానాన్ని ఢీకొన్న ఆర్మీ హెలికాప్టర్
  2. పోటోమాక్ నదిలో కుప్పకూలిన లోహ విహంగాలు 

వాషింగ్టన్, జనవరి 30: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఘోర ప్రమాదం జరిగింది. కాన్సస్ నుంచి 64 మంది ప్రయాణికులతో బయల్దేరిన అమెరికన్ ఈగల్ సీఆర్‌జే700 విమానాన్ని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఏయిర్ పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే సమయంలో రక్షణశాఖకు చెందిన సికోర్‌స్కీ హెచ్ 60  బ్లాక్‌హాక్ హెలికాప్టర్ గగనతలంలో ఢీకొట్టింది.

దీంతో ఆ రెండూ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కుప్పకూలాయి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగ్గా.. అధికారులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలను ప్రారంభించారు. హెలికాప్టర్ నుంచి ఓ మృతదేహం సహా నదిలోం చి మొత్తం 28 మృతదేహాలను వెలికి తీసినట్టు ఫైర్, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ (ఈఎంఎస్) చీఫ్ జాన్ డొన్నెల్లీ వెల్లడించారు.

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలిపిన జాన్.. ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని నమ్ముతున్నట్టు పేర్కొన్నా రు. దుర్ఘటన సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు సహా నలుగురు సిబ్బంది ఉన్నట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని, వీఐపీలు ఎవరూ లేరని రక్ష ణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదాని కి గురైన హెలికాప్టర్‌ను శిక్షణ కోసం వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. 

30 సెకన్లలోనే ప్రమాదం..

విమానం ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు పైలట్‌ను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్(ఏటీసీ) అధికారులు సంప్రదించారు. రీగ న్ ఎయిర్‌పోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన రన్‌వే 33పై విమానాన్ని ల్యాండ్ చేయగలరా? అని అడిగారు. అందుకు పైల ట్లు అంగీకరించడంతో విమానం ల్యాండింగ్‌కు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది.

ఈ క్రమం లో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే మిలిటరీ హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది. దీంతో ఏటీసీ అప్రమత్తమై ‘మీ ముందు విమానం వస్తోంది కనిపిస్తుందా?’ అంటూ ప్రశ్నించింది. ఆ తర్వాత కేవలం 30 సెకన్లలోనే రెండూ ఢీ కొన్నాయి. 

ట్రంప్ ఆగ్రహం

ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించా రు. ప్రయాణికులతో కూడిన విమా నం సరైన దిశలోనే ప్రయాణించినట్టు ట్రంప్ పేర్కొన్నారు. అయితే హెలికాప్టర్ మాత్రం విమానం మార్గంలోనే నేరుగా ప్రయాణించినట్టు తెలిపారు.

ఆకాశం నిర్మలంగా ఉండి, విమానం లైట్లన్నీ వెలుగుతున్నప్పటికీ హెలికాప్టర్ దాన్ని గమనించి కిందికో, మీదికో, పక్కకో ఎందుకు వెళ్లలేదని ట్రంప్ ప్రశ్నించారు. విమానాన్ని చూశారా? అని ప్రశ్నించే బదులు ప్రమాదాన్ని తప్పించడానికి హెలికాప్టర్ పైలెట్ ఏం చేయాలనే విషయాన్ని ఎందుకు చెప్పలేదని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. 

విమానంలో ప్రముఖ స్కేటర్స్..

పోటోమాక్ నదిలో కూలిన అమెరికన్ ఎయిర్‌లైన్ విమానంలో స్కైటింగ్ కమ్యూనిటీ కి చెందిన సభ్యులు కూడా ఉన్నారని అమెరికా స్పోర్ట్స్ అథారిటీ యూఎస్ ఫిగర్ స్కేటింగ్ ధృవీకరించింది. కాన్సాస్ వేదికగా జరిగిన డెవలప్‌మెంట్ క్యాంప్‌లో పాల్గొని ఇంటికి బయ ల్దేరిన అథ్లెట్లు, కోచ్‌లు, వారి బంధువులు విమానంలో ఉన్నట్టు వెల్లడించింది.

వారి కుటుంబాలకు ప్రగాఢ సాను భూతి ప్రకటించింది. ప్రమాదానికి గురైన విమానంలో సుమారు 15 మంది స్కేటర్లు ప్రయాణిస్తున్న రాయిటర్స్ తన కథనంలో వెల్లడించింది. ఇదిలా ఉంటే 1994లో  జరిగిన వరల్డ్ స్కేటిం గ్ ఛాంపియన్‌షిప్‌లో పెయిర్ ఫిగర్ స్కేటింగ్ విభాగంలో విజేతలుగా నిలిచిన షిస్కోవా, నౌమోవ్ జంట సైతం విమానంలో ఉన్నారు.

ఎవరూ ప్రాణాలతో లేరు

ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం శ్వేతసౌధం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేం లో మాట్లాడారు. విమానాన్ని హెలికాప్టర్ ఢీ కొట్టిన ఘటనలో ఎవరూ ప్రాణాలతో బతికి బయటపడలేదని ప్రకటించారు. ఇది చాలా విచారకరమైన వార్త అని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ఘటనపై కొద్ది క్షణాల పా టు మౌనంపాటించాలని కోరారు. ఘట నపై ప్రతిపక్షాలవిమర్శలను ఖండించారు.