ప్రధాని హసీనా రాజీనామా చేసినా బంగ్లాలో అల్లర్లు చల్లారలేదు. అల్లర్లు మొదలైన నాటి నుంచి 21 రోజుల్లో 440 మంది మరణించారు. తాజాగా జషోర్ జిల్లాలో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమయ్యారు.
ఇందులో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నాడు. అంతేకాకుండా హసీనా దేశం వీడిన కొన్ని గంటల్లోనే 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో హింసాత్మక పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా కృషి చేస్తోంది.
పార్లమెంట్‌లోనూ విధ్వంసం
హసీనా ప్రధాని బంగ్లాను వీడిన తర్వాత అక్కడ నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ప్యాలెస్‌లోకి చొరబడి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. పలు వస్తువులను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. హసీనా తండ్రి, బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చేశారు. అనంతరం వేలాది మంది నిరసనకారులు బంగ్లాదేశ్ పార్లమెంట్‌లోకి కూడా చొరబడి విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు.