27-04-2025 12:49:09 AM
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : తమ ప్రభుత్వం చేసిన కార్యక్ర మాలు చెప్పుకునేందుకు భారత్‌సమ్మిట్ ఒక వేదిక మాత్రమే కాదని, అనేక విషయాలు నేర్చుకునేందుకు కూడా ఉపయోగపడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరిగిన భారత్ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం పక్షాన భారత్ సమ్మిట్‌కు మిమ్ములందరినీ ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
భారీ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్‌లో నిర్వహించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చిన మొదటిరోజు నుంచే ప్రజల కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. అణగారిన, పేద వర్గాల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
అహింస, స్వతంత్య్ర, ప్రపంచ శాంతి, న్యాయం తమ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ విజన్ అని అన్నారు. రాహుల్‌గాంధీ విజన్‌ను తమ ప్రభుత్వం కొనసాగిస్తోందని, భవిష్యత్తులో తమ పాలసీలు, పథకాలు, ఆలోచనల్లో వీటిని మరింత సమర్థవంతంగా అమలుచేస్తామన్నారు.