13-02-2025 12:38:51 AM
ఉచితాలపై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: వివిధ పార్టీలు ఎన్నికల సందర్భంగా ప్రకటిస్తున్న ఉచితాలపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసింది. ప్రజలను సోమరిపోతులుగా మారుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం ఉచిత పథకాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
‘ఇలా అంటున్నందుకు క్షమించండి. ఈ వ్యక్తులను సమాజ అభివృద్ధిలో భాగం చేయడం లేదు.. మనం ఏం పరాన్నజీవుల గుంపును తయారు చేయడం లేదు కదా.. కానీ ఈ ఉచితాల వల్ల ఎవరూ పని చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఉచితంగా రేషన్, డబ్బులు ఇస్తుంటే ఎవరు మాత్రం పని చేసేందుకు ఇష్టపడతారు. సంక్షేమం మంచి ఆలోచనే కానీ ఇలా ఉచితాలు ఇవ్వడం వల్ల ఎవరైనా కష్టపడి పని చేస్తున్నారా? ఎన్నికల సమయంలో ఉచితాలు ప్రకటించే పద్ధతి సరికాదు’ అని జస్టిస్ గవాయ్ అభిప్రాయపడ్డారు.
ఇంకెంత సమయం కావాలి..
పట్టణాల్లో ఉన్న నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను ప్రవేశపెట్టే పని లో తుది దశకు చేరుకుందని, అటా ర్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఈ నిర్మూలన మిషన్‌ను ప్రవేశపెట్టేందుకు ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియజేయాలని కేం ద్రాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ ను మరో ఆరు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది.