calender_icon.png 23 December, 2024 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రివాల్వర్‌తో బెదిరిస్తు.. అక్రమాలకు పాల్పడుతున్న పలువురు అరెస్టు

08-09-2024 08:39:32 PM

వివరాలు వెల్లడించిన డీసీపీ

మంచిర్యాల,(విజయక్రాంతి): రివాల్వర్ తో బెదిరింపు, దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ వెల్లడించారు. శని వారం సాయంత్రం విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ... నెన్నెల మండలానికి చెందిన జితేందర్, ఆయన భార్య స్వాతికి మధ్య మూడు నెలల కిందట గొడవలయ్యాయి. స్వాతి మంచిర్యాల ఏసీసీలోని తన తల్లిగారింటి వద్ద ఉంటుంది.

ఈ క్రమంలో జితేందర్ తన భార్య కోసం ఏసీసీకి రాగా అక్కడ నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన రాంటెంకి అన్వేష్ ఉండటాన్ని చూసిన జితేందర్ ఇక్కడ నీకేం పని అని అన్వేష్ ను ప్రశ్నించాడు. దీనితో జితేందర్ నీ కొట్టి తన వద్ద ఉన్న రివాల్వర్ తో చంపుతానని బెదిరించడంతో జితేందర్ భయంతో కేకలు వేశాడు. చుట్టు పక్కల వారు పోగవుతుండటంతో అన్వేష్ అక్కడి నుంచి పారిపోయాడు. జరిగిన విషయాన్ని వివరిస్తూ జితేందర్ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో శుక్ర వారం ఫిర్యాదు చేశాడన్నారు.

విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి...

జితేందర్ ఇచ్చిన ఫిర్యాదు అందుకున్న మంచిర్యాల సీఐ బన్సీలాల్ శని వారం విచారణ జరుపుకున్న క్రమంలో మంచిర్యాల రైల్వే స్టేషన్లో అన్వేష్ తో పాటు నెన్నెల మండలం ఆవడానికి చెందిన దుర్గం భాను ప్రసాద్, నస్పూర్ లోని శ్యాం నగర్ కు చెందిన మంతెన అశోక్ లు పట్టుబడినట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. వీరిని విచారించగా అన్వేష్, భానుప్రసాద్ లు వరుసకు అన్నదమ్ములు కాగా అశోక్ వీరి స్నేహితుడని, వీరితో పాటు నెన్నెల మండలానికి చెందిన కామెర మధు, దుగుట దిలీప్ లు కలిసి కొన్ని సంవత్సరాలుగా నెన్నెల మండలంలో అమాయక ప్రజలను బెదిరిస్తూ, బంగారం పూతతో ఉన్న రాగి బిళ్లలను బంగారు నాణాలుగా అమ్ముతున్నట్లు భయటపడిందన్నారు.

న్యూడెమోక్రసీ పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ పీడీఎస్ యు జిల్లా అధ్యక్షుడిగా, న్యూడెమోక్రసీ సింగరేణి అనుబంధ సంస్థ ఇప్టు లో పని చేసిన చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామానికి చెందిన తోకల తిరుపతి కి చెందిన రివాల్వర్ ని తన బావమరిది అయిన అశోక్ ఇంటి వద్ద దాచేవాడని, ఇటీవల తిరుపతి మృతి చెందడంతో అశోక్ లివాల్వర్ ని ఉపయోగించి అన్వేష్, భానుప్రసాద్ లతో కలిసి బెదిరించి డబ్బులు సొమ్ముచేసుకునేవారన్నారు. అశోక్ గత వారం ఈ రివాల్వర్ ను జితేందర్ ను చంపేందుకు అన్వేష్ కు అందజేశాడు.

ఈ రివాల్వర్ తో పాటు అన్వేష్ మహారాష్ట్ర నాందెడ్ నుంచి ఒక ఎయిర్ పిస్టోలు, ఒక కత్తిని కొనుక్కువచ్చి పిస్టోలును భానుప్రసాద్ వద్ద, కత్తిని తన వద్ద ఉంచుకున్నాడన్నారు. వీటి సహాయంతో పలుమార్లు మండలంలోని ప్రజలను బెదిరించినట్లు విచారణ లో తేలిందన్నారు. ముగ్గురు హైదరాబాద్ పారిపోతుండగా మంచిర్యాల రైల్వే స్టేషన్ లో పట్టుకొని వారి వద్ద నుంచి రివాల్వర్, ఎయిర్ పిస్టోల్, రెండు కత్తులను, మూడు బుల్లెట్లను సీజ్ చేసి వారిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసిపి ప్రకాష్, సిఐ బన్సిలాల్ తదితరులు పాల్గొన్నారు.