28-02-2025 10:27:15 PM
కొరవడిన పోలీసుల పెట్రోలింగ్...
ఆందోళనలో ప్రజలు..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో గత కొద్దిరోజులుగా గుర్తు తెలియని దొంగలు సంచరిస్తుండడం ప్రజలను ఆందోళన గురిచేస్తుంది. రాత్రి సమయాల్లో దొంగలు యదేచ్చగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాజాగా మూడు రోజుల కిందట తాండూర్ బస్టాండ్ నుండి యూనియన్ బ్యాంక్ పరిసరాల్లోని రోడ్లపై గుర్తు తెలియని దొంగలు అర్ధరాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తూ నిఘా నేత్రాలకు చిక్కారు.
యూనియన్ బ్యాంక్ గల్లీలో నిలిపి ఉంచిన బైక్ లను ఎత్తుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేసిన దొంగలు ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరాలను గమనించి మెల్లగా అక్కడ నుంచి జారుకున్నారు. అదే ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక బైకును ఎత్తుకెళ్లడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటుంది. రాత్రి వేళల్లో పోలీసుల పెట్రోలింగ్ లేకపోవడంతోనే దొంగలు రెచ్చిపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తాండూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించి దొంగల బెడదను అరికట్టాలని తాండూర్ మండల టిడిపి అధ్యక్షులు దాసరి శ్రీనివాస్, నాయకులు చాపిడి శ్రీనివాస్ తో పాటు మండల కేంద్రంలోని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.