ఏటా 50 వేల మంది మృత్యువాత
న్యూఢిల్లీ, జూలై 29: దేశంలో పాముకాట్లు ప్రజలకు ప్రమాదకరంగా మారాయి. ప్రపంచంలో పాము కాట్లతో ఏటా అత్యధికంగా మరణిస్తున్నది భారతీయులేనని తేలింది. ప్రతి సంవత్సరం దాదాపు 50 వేల మంది పాములు కరిచి చనిపోతున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్‌ప్రతాప్ రూఢీ సోమవారం లోక్‌సభలో ఆందోళన వ్యక్తంచేశారు. ‘దేశంలో బీహార్ అతి పేద దేశం. ప్రకృతి విపత్తులు, పేదరికంతో తల్లడిల్లుతున్నది. దేశంమొత్తంలో ఏటా 30 నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. వారిలో కనీసం 50 వేలమంది మరణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం’ అని పేర్కొన్నారు. ఈ మరణాల్లో చాలావరకు నివారించగలిగేవే అయినా సరైన సమయంలో వైద్యం అందక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పర్యావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరగటం కూడా పాము కాట్లు పెరగటానికి కారణమేనని పేర్కొన్నారు.