calender_icon.png 26 October, 2024 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు

12-09-2024 12:00:00 AM

కేసీఆర్ ఎన్ని యాగాలు చేసినా మళ్లీ సీఎం కాలేడు

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11: రేవంత్ రెడ్డి వీరుడు, శూరుడు అనుకుంటే ఆయనకు అంత సీను లేదన్న విషయం ఆరు నెలల్లోనే తేలిపోయిందని, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశామని ప్రజలు బాధపడుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నా రు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా బుధవారం గచ్చిబౌలి డివిజన్‌లోని గౌలిదొడ్డిలో జరిగిన కార్యక్రమానికి  ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. చేతిగుర్తు ప్రజల పాలిట భస్మాసుర అస్త్రంగా మారిందని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ అరాచక పాలన మీద పోరాటం చేసిందే బీజేపీ అని, బీఆర్‌ఎస్ హయాంలో ఎందరో అమాయకులు బలయ్యారన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలసి పోటీ చేసినా బీజేపీని ఓడించలేవని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 6 గ్యారంటీలను అటకెక్కించి ప్రజల ను దారి మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా డ్రామా మొదలు పెట్టారని వాపోయారు. సామన్య జనాలపై ప్రతాపం చూపుతున్న హైడ్రా.. పెద్దల జోలికి ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు.

వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ యాగాలు చేస్తున్నారని, ఎన్ని యాగాలు చేసినా ఆయన మళ్లీ సీఎం కాలేరని అన్నారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి నోటికి వచ్చినట్లు మాట్లాడుతన్నారని, ఆయన రెండు జెండాలు, ఎజెండాలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ప్రతీ బీజేపీ కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ కోరారు.