calender_icon.png 19 April, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణల సంగతేంచేశారు.. మంత్రి గారూ?

19-04-2025 12:30:42 AM

మళ్లీ వర్షాలు సమీపిస్తున్న వేళ ప్రజల్లో భయాందోళన 

కార్పొరేట్ కాలేజీ చెరలో కోట్ల విలువైన కాల్వ భూములు 

ఇప్పటికైనా మంత్రి స్పందించాలంటున్న ప్రజలు 

ఆక్రమణల చెరలో ఖానాపురం చెరువు అలుగు కాల్వ 

ఖమ్మం, ఏప్రిల్ 18 ( విజయక్రాంతి ) :వర్షాకాలం పోయి మళ్ళీ వర్షాకాలం సమీపిస్తున్నా ఇంతవరకు ఖమ్మం లో చెరువులు, కాల్వల ఆక్రమణల సంగతిని ఇంతవరకు ఎటూ తేల్చకపోవడంతో ఖమ్మం పట్టణ ప్రజల్లో వణుకుబయలు దేరింది. పోయిన వర్షాకాలంలో మున్నేరుకు పెద్ద ఎత్తున వరదలు వచ్చి నగరాన్ని చుట్టుముట్టి, ప్రజల్ని అతలాకుతలం చేసి, ముప్పు తిప్పలు పెట్టిన సంగతిని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. నాడు మంత్రులు దగ్గర నుంచి ఉన్నతాధికారులతా ఎంతో హడావిడి చేసిన వారంతా ఇప్పుడు సైలెంట్‌అయిపోవడం గమనార్హం.

ఖమ్మం చుట్టపక్కల ఉన్న ఖనాపురం చెరువు, లకారం చెరువు, ధ్వంసలాపురం చెరువులు, వాటికి సంబంధించిన ప్రధాన కాల్వలు ఆక్రమణకు గురైన నేపథ్యంలోనే ఆనాడు గతంలో ఎన్నడూ లేనంతంగా పట్టణం అంతా వరదముంపునకు గురైన సంగతి తెలిసిందే. కాల్వలను ఎక్కడికక్కడ ఆక్రమించి, వాటి మీద పెద్ద పెద్ద భవనాలు నిర్మించడంతో వరదనీరు ఎటూ పోలేని దుస్ధితిలో ఇళ్లను ముంచెత్తింది.

కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల పై కప్పులు, స్లాబ్ల పైకి వరద నీరు వచ్చిన సంగతిని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడిదంతా ఎందుకు గుర్తు చేస్తున్నామంటే మరో నెల రోజులు తర్వాత వర్షాలు ప్రారంభం కాబోతున్నాయి. మళ్ళీ అదే పరిస్థితి దాపురించే ప్రమాదం ఉందని గుర్తు చేయడం జరుగుతుంది.కనీసం దీనిని చూసైనా అధికారులు, మంత్రులు స్పందించి, కనీసం ఇప్పటికైనా ఆక్రమణల సంగతి చూస్తారన్న ఆశతోనే మళ్లీ గత చరిత్రను గుర్తు చేయడం జరుగుతుంది. ఖమ్మంలో ప్రధాన భాగంగా ఉన్న ఖానాపురం చెరువుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దీని నుంచి ప్రారంభమయ్యే ప్రధానకాల్వ ఖమ్మం నగరం నడిబొడ్డు నుంచి

ధ్వంసలాపురం చెరువు వరకు కొనసాగతుంది. కాల్వ నిర్మించిన రోజుల్లో ఖమ్మం నగరం పెద్దగా విస్తరించ లేదు. నేడు పట్టణం భారీగా విస్తరించడంతో పాటు భూముల ధరలు కోట్లకు చేరడంతో ఇప్పుడు అందరి దృష్టి వాటిపై పడింది. ఇంకేముంది చెరువు కాల్వ భూములు వదిలిపెట్టకుండా ఆక్రమించడం జరిగింది. ఖానాపురం చెరువు ప్రధాన కాల్వ నగరం నడిబొడ్డున మీదుగా వెళ్లడంతో దాదాపుగా చాలా చోట్ల ఈ కాల్వను అందినకాడికి ఆక్రమించేశారు.

చైతన్యనగర్ ప్రాం తంలో కాల్వ అలుగు ప్రాంతాన్ని చాలా మంది ఆక్రమించి, భారీ భవనాలు నిర్మించారు. అంతేకాకుండా ఓ కార్పొరేట్ స్కూలు యాజమాన్యం ఏకంగా కాల్వ అలుగు భూమిని పెద్ద ఎత్తున ఆక్రమించి, అందులో భారీ భవనాలు నిర్మించారు. కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు కూడా 9,10 డివిజన్లలో పెద్ద ఎత్తున కాల్వను ఆక్రమించారు. కార్పొరేట్ స్కూలు యాజమాన్యం చేసిన ఆక్రమణాల వల్లనే గత వర్షాకాలంలో ఆ ప్రాంతంలోని ఇళ్లన్నీ వరదతో నిండిపోయాయి.

కోట్లాది రూపాయల ఆస్తిని ప్రజలు కోల్పోయారు. వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆస్థిని ప్రజలు కోల్పోయిన సంగతి విదితమే. ఆనాడు ప్రజలంతా ఈ ఆక్రమణాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆక్రమణలు తొలగిస్తానని హామి ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామి నెరవేరిన దాఖలాలు కనిపించడం లేదు. పైగా మళ్ళీ వర్షాకాలం సమీపిస్తున్న క్రమంలో ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. సంబంధిత కార్పొరేట్‌స్కూలు యాజమాన్యం మంత్రిపై వత్తిడి తేవడం వల్లనే ఆక్రమణాల జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కాల్వ దాదాపు 100 అడుగులు వరకు ఉండేది. కానీనేడు ఆక్రమణాల వల్ల 30 అడుగులు కూడా సక్రమంగా లేదంటున్నారు.

మిగతా అంతా ఆక్రమణల చెరలోనే ఉందంటున్నారు. కోట్లాది రూపాయల విలువై ఖనాపురం చెరువు కాల్వ భూములు ఆక్రమణలను సత్వరమే తొలగించాలని పట్టణ ప్రజలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరుతున్నారు. లేకుంటే ప్రజల్ని సమీకరించి, పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు ఆప్రాంత ప్రజలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా అధికారులు కానీ మంత్రి కానీ ఎందుకు ఈ విషయంలో సరైననిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. గత వరదల సమయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడం తో మంత్రి తుమ్మలనాగేశ్వరరావు స్వయం గా స్పందించారు. ఆక్రమణదారులు ఎంత టి వారైనా సరే తొలగించి, ప్రజలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. కానీ ఆ మాట ఇంతవరకు నెరవేరలేదంటున్నారు. 

ఇప్పటికైనా ఆ మాటను నిలబెట్టుకోవాలని స్థానికులు మంత్రిని కోరుతున్నారు. మళ్ళీ వర్షాలుప్రారంభం కాకముందే కాల్వ ఆక్రమణాలు తొలగించి, పరిస్థితిని సరిదిద్దాలని స్థానికులు మంత్రిని వేడుకుంటున్నారు. మంత్రి ఇప్పటికైనా స్పందించి, ఆ దిశగా స్పందించి, చర్యలు తీసుకుంటారని అంతా ఆశిస్తున్నారు.