కులమతాల పేరుతో మోదీ రాజకీయం
సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
గజ్వేల్, డిసెంబర్ 1: రాష్ట్రంలో రేవంత్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరగగా, కులమతాల పేరుతో కేంద్రంలో బీజేపీ రాజకీయం చేస్తోందని సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో సీపీఐఎం జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన తమ్మినేని మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబానీ, అదానీలను ప్రోత్సహిస్తూ ఆర్థిక దోడిపీకి పాల్పడుతున్నారన్నారు.
అదానీ వ్యవహారంపై కేంద్రం ఎందుకు మౌనం వహిస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికాలో జరిగిన కుంభకోణంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల దోపిడీకి సంబంధించిన నివేదికలు వెలువడుతున్నా వాటిపై చర్చించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. గత ప్రభుత్వం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు తీసుకుంటే విమర్శించిన ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి..ఇప్పుడు కొడంగల్‌లో లగచర్ల పరిశ్రమ విషయంలో రైతులతో అవలంబిస్తున్న విధానం ఎలాంటిదో చెప్పాలన్నారు.
వ్యవసాయానికి పనికిరావని సీఎం రేవంత్ చెప్పిన భూములను సీపీఐఎం పార్టీ పరిశీలించిందని, రైతులు మూడు పంటలు పండించే భూములుగా తిరిగి సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు వీరభద్రం తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం తప్పా ఏ ఒక్క గ్యారంటీని అమలు చేయలేదని విమర్శించారు. హైడ్రా తీసుకొచ్చి పేదల ఇండ్లను కూల్చిన సీఎం.. కమ్యునిస్టు పార్టీలు అడగడంతో వెనక్కి తగ్గిందన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమటీ సభ్యులు నాగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్క రాములు, మల్లారెడ్డి పాల్గొన్నారు.