25-04-2025 06:32:48 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణలో పక్షపాతం చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ప్రయాణించే రహదారిని నిత్యం ఊడుస్తూ అద్దంలా ఉంచుతున్నారని, గల్లీ రోడ్లు, అంతర్గత వీధులను ఊడ్చడం లేదని, కనీసం చెత్త కూడా ఎత్తడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కేసముద్రం మున్సిపాలిటీ కమిషనర్ గా వరంగల్ నగర పాలక సంస్థలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న ప్రసన్న రాణికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి కమిషనర్ గా డిప్యూటేషన్ ఇచ్చారు.
కమిషనర్ వరంగల్ నుంచి కారులో కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయానికి వచ్చే ప్రధాన రహదారిని ప్రతిరోజు పారిశుద్ధ్య సిబ్బంది చెత్త కనబడకుండా పరిశుభ్రంగా ఊడ్చి.. చెత్తను ఎత్తుకెళ్లి డంపింగ్ యార్డులో వేస్తున్నారని చెబుతున్నారు. అయితే పట్టణ పరిధిలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, చెత్తకుండీలను పట్టించుకునే వారే కరువయ్యారనే విమర్శలు అధికంగా వస్తున్నాయి. చిన్న చిన్న గల్లీల్లో రోడ్లను ఏడాదికోసారి కూడా ఊడ్చడం లేదని, ఆయా వీధుల్లో ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లో పేరుకుపోయిన చెత్తను సక్రమంగా తొలగించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోందని వాపోతున్నారు.
ఇక పట్టణ పరిధిలోని పలు కాలనీల వైపు పారిశుద్ధ్య సిబ్బంది కన్నెత్తి చూసిన దాఖలాలు కూడా లేవని ఆరోపిస్తున్నారు. కేవలం ప్రధాన రహదారులు, అధికారులు తనిఖీ చేసే పరిస్థితి ఉన్న ప్రాంతాల్లోనే పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేస్తూ, మిగిలిన ప్రాంతాలపై శీతకన్ను పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి వివక్ష లేకుండా పట్టణంలోని అన్ని వీధుల్లో పారిశుద్ధ్య పనులను సక్రమంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చెత్త ఎత్తమని.. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు
అందరిలాగే మేము కూడా మున్సిపాలిటీకి ఇంటి పన్ను, ఇతర పనులను చెల్లిస్తున్నాం. అయితే కేవలం ప్రధాన రహదారుల్లోనే పారిశుద్ధ్య పనులు ప్రతిరోజు నిర్వహిస్తూ, గల్లీలపై నిర్లక్ష్యం చూపుతున్నారు. గల్లీలో ఉన్న సైడ్ కాలువలను తరచుగా శుభ్రం చేయడం లేదు. చెత్తకుండీలో చెత్తను తొలగించడం లేదు. చెత్త తొలగించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. గట్టిగా అడిగితే తప్ప పారిశుద్ధ్య పనులు చేయడం లేదు. అందరిలాగే మేము కూడా పన్నులు చెల్లిస్తున్నాం.. మాపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. గల్లీలో చెత్త చెదారం పేరుకుపోయి దుర్గంధంతో భరించలేకపోతున్నాం.
వెంకన్న, బ్రహ్మంగారి తండా కాలనీ
ఆకస్మిక తనిఖీ చేస్తా..
కేసముద్రం పట్టణంలో ప్రతి వీధి శుభ్రంగా ఉండేలా చూస్తా. గల్లీలో శుభ్రం చేస్తున్నారా లేదా అన్న అంశాన్ని పరిశీలించడానికి నేరుగా ఆకస్మిక తనిఖీలు చేస్తా. ప్రధాన రహదారితో పాటు పట్టణంలోని అన్ని వీధులను పరిశుభ్రంగా ఉండడానికి అవసరమైన కార్యాచరణ చేపడతాం. ప్రధాన రహదారికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాం. అంతే తప్ప గల్లీలో నిత్యం శుభ్రం చేయవద్దని చెప్పలేదు.
ప్రసన్న రాణి, మున్సిపల్ కమిషనర్