కూకట్‌పల్లి (విజయక్రాంతి): తమ ప్రభుత్వ హయాంలో చెరువులు కబ్జాకు గురి కాలేదని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కూకట్‌పల్లిలో చెరువులు కబ్జాకు గురయ్యాయని అప్పటికే చెరువుల్లో ఇండ్లు ఏర్పడి ప్రజల నివసిస్తున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాదు నగరంలోని అన్ని చెరువుల విస్తీర్ణం, ఆక్రమణలను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసిన నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇంటర్నెట్ లో పెట్టిన సమాచారం అంత మీ అధికారులు ఇచ్చిన తప్పుల తడాఖా అన్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ హైదరాబాదు నగర ప్రజలను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.
ఇలాంటి తప్పుదోవతో ప్రజలను అయోమయానికి గురి చేస్తూ హైడ్రా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా అదే హైడ్రా పేరిట నేడు రెవిన్యూ మంత్రి చేయాల్సిన పనిని ఆర్థిక మంత్రి హైదరాబాదు నగరంలోని చెరువులు మిన్నంటి పోయాయని అనడం సమంజసం కాదన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణారావు కూకట్‌పల్లిలోని 9 చెరువులపై రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ద్వారా చెరువులపై పూర్తి సమాచారం పొందారు. ఆర్థిక మంత్రి చెప్పిన దానికి, అధికారులు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారానికి పొంతన లేదని ఎమ్మెల్యే అన్నారు. గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన సమాచారంలో గతంలోనే కొన్నేళ్ల కిందటే నివాసాలు ఏర్పడ్డాయని నేడు కూకట్‌పల్లిలోని తొమ్మిది చెరువుల్లో బఫర్ జోన్ లో నివాసాలు లేవని అధికారులే స్పష్టంగా వివరాలను వెల్లడించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఆర్థిక మంత్రి అధికారుల నుండి సరైన సమాచారం తీసుకొని ప్రజలకు తెలియజేయాలన్నారు. తప్పుడు సమాచారంతో చెరువుల దగ్గర ఉంటున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేయోద్దన్నారు. ఏరియల్ సర్వే కాకుండా, చెరువులను స్వయంగా పరిశీలించి చెరువు విస్తీర్ణం, ఎఫ్ టీ ఎల్ నిర్ధారించాలన్నారు. చెరువుల పై సర్వేకు కమిటీ ఏర్పాటు చేసి, ఆ సర్వే కూకట్‌పల్లి నుండి మొదలు పెట్టాలన్నారు. చెరువులో పట్టా భూములు ఉన్నవారికి నష్ట పరిహారం చెల్లించి, ఆ భూములను స్వాధీనం చేసుకుని, అభివృద్ది చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.