25-02-2025 12:00:00 AM
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
షాద్ నగర్,ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి) అనంత పద్మనాభ స్వామి ఆలయాలకు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేరళ, వికారాబాద్ తర్వాత షాద్ నగర్ నియోజకవర్గంలో పెంజర్ల గ్రామం అంత ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తుందని ఇది ఎంతో శుభ పరిణామమని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో పునర్నిర్మించిన 800 ఏళ్ల నాటి స్వయంభు శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయ ప్రారంభోత్సవ ఆధ్యాత్మిక వేడుకలకు స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ జాతీయ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితర స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ ప్రకాష్ గౌడ్ ఏఐసీసీ నేత చల్ల వంశీ చంద్ రెడ్డిలకు ఆలయ నిర్వాహకులు మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ బెజవాడ అనితారెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు స్వాగతం పలికారు.
ప్రత్యేక పూజలు అనంతరం గడ్డం ప్రసాద్ కుమార్ వీలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ప్రముఖ ఆలయం తర్వాత వికారాబాద్ లో అంతటి పుణ్యస్థలం ఉందని.... ఇప్పుడు 800 ఏళ్ల నాటి స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇక్కడ వెలవడం ఎంతో గొప్ప విషయం అని స్పీకర్ కొనియాడారు.
దేశంలో ఈ మూడు ప్రాంతాలు స్వయంభూ ఆధ్యాత్మిక ప్రఖ్యాతిని గాంచుతాయని ఆయన అన్నారు. ఎంతో గొప్ప విశేషం కలిగి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ప్రాంతం భవిష్యత్తులో ఎంతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరసిల్లుతుందని అన్నారు.
ఒకప్పుడు అడవి ప్రాంతంగా ఉండే ఈ ప్రాంతంలో 800 ఏళ్ల స్వయంభు అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉండడం దాని మహిమాన్విత్వమైన విశేషతను గుర్తించి మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, బెజవాడ అనిత రెడ్డిలు ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేయడం అభినందనీయమని ప్రశంసించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చల్లగా ఉండాలి...
పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాల్లో ఆ దేవుడిని తాను ముఖ్యమంత్రి ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండి వారి కుటుంబం చల్లగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఈ రాష్ట్ర ప్రగతిని ముందుకు నడిపించే విధంగా ఆయనకు స్వామి చల్లని కరుణ కటాక్షాలు ఉండాలని ఆ దేవుని కోరుకున్నట్లు తెలిపారు.