12-04-2025 11:34:20 PM
హనుమకొండ (విజయక్రాంతి): హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ, మహిళా, శిశు సంక్షేమ శాఖలపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పంచాయతీ రాజ్ శాఖ ద్వారా సీఆర్ఆర్, సిడిపి, నిధుల ద్వారా చేపట్టిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రినీ కోరారు.
నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన వేలేరు, చిల్పూర్ మండలాలలో ఇంటిగ్రేటెడ్ మండల్ ఆఫీస్ కాంప్లెక్స్ మంజూరు ఇవ్వాలని అలాగే జఫర్ గడ్ మండలంలో ఎంపీడివో కార్యాలయం శిథిలావస్థలో ఉందని కావున నూతన ఎంపీడివో కార్యాలయం మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మిషన్ భగీరథ చాలా గ్రామ పాత పైప్ లైన్ కే కనెక్ట్ చేశారాని అవి తగిన సామర్థ్యం లేక పగిలి పోతున్నాయని అలాగే వాటర్ ట్యాంక్ లు నిర్వహణ లేక ట్యాంక్ లు క్లిన్ చేయడానికి నిచ్చెనలు కూడా లేవని తెలిపారు. వెంటనే ట్యాంక్ ల నిర్వహణకు నిధులు కటాయించి రిపేర్లు చేయించాలని అన్నారు. గ్రామాలలో అవసరానికి సరిపడా నీరు రావడం లేదని గ్రామాలలో అవసరం ఉన్న చోట బోర్లు వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. త్రాగు నీటి సమస్యలు తలేత్తకుండా ఇప్పుడే రిజర్వాయర్లను నింపాలని తెలిపారు. పంటల సీజన్ కూడా అయిపోయినందున వెంటనే పంపింగ్ స్టార్ట్ చేసి రిజర్వాయర్లను నీటి నిలువలు ఉండే విధంగా చూడాలని కోరారు.