calender_icon.png 29 September, 2024 | 2:59 AM

పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి

29-09-2024 12:59:11 AM

దిశ కమిటీ సమావేశంలో ఎంపీ అర్వింద్

ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యేల ఆగ్రహం

నిజామాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు.

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. మాక్లూర్ మండలం మామిడిపల్లి వద్ద జరుగుతున్న ఆర్వోబి, రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యంపై చర్చించేందుకు అక్టోబర్ రెండో వారంలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులు ఏ దశలో ఉన్నాయో నివేదిక సమర్పించాలని కోరారు. వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులు, నిధుల ఖర్చు విషయమై ఆయా శాఖల అధికారులు వివరించారు. కాగా అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనాయణ, రాకేశ్‌రెడ్డి ఆక్షేపించారు.

దీనిపై ఎంపీ అర్వింద్ స్పందిస్తూ, ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్‌అండ్‌బీ చీఫ్ గజవాడ హన్మంతరావును ఎంపీ సన్మానించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, డీఆర్డీవో పీడీ సాయగౌడ్, డీఈవో దుర్గాప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతికుమార్ పాల్గొన్నారు.