15-04-2025 09:33:33 PM
సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్
మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలో ఏజెన్సీల ద్వారా విధులు నిర్వహిస్తున్న వారి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని అనంత సొల్యూషన్, విద్యాంజలి 2.0 ద్వారా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల లో ఆఫీస్ సబార్డినేటర్, వాచ్మెన్, అటెండర్, స్విపర్, ఇంగ్లీష్ టీచర్, కంప్యూటర్ ఆపరేటర్, యోగ తదితర పనులకు సుమారు 40 నుంచి 50 మంది ఈ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు.
గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల నుంచి రిక్రూట్ చేసుకున్న సదరు ఏజెన్సీలు రిక్రూట్ కు ముందు సంస్థ కోఆర్డినేటర్లు ప్రతి నెల రూ. 15 వేల వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ చెల్లిస్తామని చెప్పారు కానీ నేటికీ 8, 9 నెలల గడిచిన సదరు అనంత సొల్యూషన్, విద్యాంజలి 2.0 సంబంధించిన జిల్లా కోఆర్డినేటర్లు వేతనాలు చెల్లించడం లేదన్నారు. వేతనాలు అడిగితే రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని, నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణకు, రోజువారి ఖర్చులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అనంత సొల్యూషన్, విద్యాంజలి 2.0 సంబందించిన జిల్లా కోఆర్డినేటర్లకు రావలసిన వేతనాలు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ ఆశ్రమ పాఠశాల, హాస్టల్ అనంత సొల్యూషన్ విద్యాంజలి 2.0 ఉద్యోగులు స్వాతి, సాయిరాణి, సువర్ణ, శ్యామల, కమల, రాజేశ్వరి, కల్పన, రజిత, ప్రశాంతి, దివ్యశ్రీ, శుభ, స్వరూప, వెంకటమ్మ, మమత, నరేష్, శ్రీనివాస్, నగేష్ తదితరులు ఉన్నారు.