calender_icon.png 13 March, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి

13-03-2025 05:57:50 PM

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద నాగక్రిష్ణ, బి.అభిమన్యు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో విద్యాశాఖ కు 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగకృష్ణ, అభిమన్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టరేట్  కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 6,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ,ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని,  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో గురుకులాలలో ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, జిల్లాలో అద్దె భవనాలలో నిర్వహిస్తున్న వసతి గృహాలకు సొంత భవనాలను నిర్మించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని డైట్ చార్జీలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.  జిల్లాలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఇతర వసతి గృహాలలో సక్రమంగా మెనూ అమలు అయ్యేలా అధికారులు పర్యవేక్షణ పెరిగేలా చర్యలు తీసుకోవాలని. పరీక్షలకు సన్నద్ధం అవుతున్న పదవ తరగతి విద్యార్థులకు నాణ్యమైన అల్ప ఆహారం అందించాలని, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలో ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ నియంత్రించాలని, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రించాలని, అలాగే జిల్లా కేంద్రంలో న్యాయ విద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు భవ్యశ్రీ , జిల్లా ఉపాధ్యక్షులు రాంచరణ్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.