22-03-2025 06:21:45 PM
సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులకు గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించని నేపథ్యంలో పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశంలో ఏజే రమేష్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
ఇచ్చే అరకొర జీతాలు కూడా సమయానికి రాకపోవడం వల్ల అనేక చోట్ల అప్పులు చేసి ఇప్పుడు అప్పులు కూడా పుట్టే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్మికుల సమస్యలపై అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకొని వారి వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసినారు. అలాగే ఈ పెండింగ్ వేతనాలు విడుదల తోపాటు గ్రామపంచాయతీ కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలని వారికి పని భద్రత కల్పించాలని అర్హులైన వారందరికీ మంజూరు చేయాలని పెన్షన్లు మంజూరు చేయాలని ఏజె రమేష్ కోరారు. కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమం పథకాలన్నీ కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తారీఖున హైదరాబాదులో ఇందిరాపార్క్ దగ్గర జరిగే ధర్నాని జయప్రదం చేయాలని రమేష్ పిలుపునిచ్చారు.
ఈ వేతనాలు విడుదల చేయకపోతే ఏప్రిల్ 2వ తేదీ నుంచి అనివార్యంగా కార్మికులు సమ్మెలోకి వెళ్ళవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి వారి వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. .ఈ కార్యక్రమానికి గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు కాపుల రవి అధ్యక్షత వహించగా పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి గ్రామపంచాయతీ యూనియన్ నాయకులు, చందు, శ్రీనివాస్, చెన్నకేశవులు ,సాయి ,ప్రేమ్ కుమార్, లక్ష్మణ్ ,వరరాజు ,మనోజ్ రెడ్డి, రజనీకాంత్, కత్తి శీను, ఆదినారాయణ ,కృష్ణ ,భాను ,విజయ ,పీ రమ్మ, అనసూయ, అనేకమంది కార్మికులు పాల్గొన్నారు