గద్వాల, జనవరి 28 ( విజయక్రాంతి ) : డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పెండింగ్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు పరుమాల, గోనుపాడు గ్రామాలలో నిర్మిస్తున్న రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, లబ్ధిదారులకు ఇళ్లను త్వరగా అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రాథమిక వసతులైన నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్లు, డ్రైనేజ్ వ్యవస్థ, సెప్టిక్ ట్యాంకులు, పరిసరాల శుభ్రత, సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారు లకు ఆదేశించారు.
లబ్ధిదారుల ఎంపికలో భాగంగా ఇప్పటికే కొంత మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, మిగతా లబ్ధిదారులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రి య లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేయాలన్నారు. సమావేశానికి హాజరుకాని విద్యుత్ శాఖ, హౌ సింగ్ శాఖల అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ రావు, ఇరిగేషన్ ఈఈ శ్రీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ డి ఈ లక్ష్మణ్, విద్యుత్ శాఖ ఏ ఈ శ్రీనివాస్, కలెక్టర్ కార్యాలయం డిప్యూటీ తహశీల్దార్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.