- విడుదలకు నోచుకోని బీఏఎస్ బకాయిలు
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
- బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌లో ఏటా 194 మందికి అడ్మిషన్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): కార్పొరేట్ స్కూళ్లలో పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విద్యనందించాలనే ఉన్నత లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్(బీఏఎస్)ను అమలు చేస్తోంది. ప్రతీ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభంలో లక్కీ డ్రా నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
వారికి కార్పొరేట్ స్కూళ్లలో విద్యనందిస్తారు. హైదరాబాద్ జిల్లాలో డే స్కాలర్ కొనసాగుతుండగా, ఇతర జిల్లాల్లో హాస్టల్ వసతితో కలిపి విద్యను అందిస్తున్నారు. ఎస్సీ విద్యార్థులకు ఒకటో తరగతిలో, ఎస్టీలకు 3, 5, 8వ తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. నగరంలోని పలు ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ ఈ స్కీమ్ అమలవుతోంది.
నగరంలో 11 స్కూళ్లలో దళిత విద్యార్థులు, ఒక స్కూల్‌లో గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌లో వివిధ కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది. అయితే నాలుగేండ్లుగా బీఏఎస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను చెల్లించలేదు.
యాజమాన్యాల ఒత్తిడి..
బీఏఎస్ స్కీమ్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.180 కోట్ల బకాయిలుండగా, హైదరాబాద్ జిల్లాలో దాదాపు 5 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో యేటా 11 స్కూళ్లలో 159 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. జిల్లాలో మొత్తం 763 మంది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ విద్యార్థులుండగా ఒక్కో విద్యార్థికి గతంలో రూ.19 వేలు ఇచ్చేవారు.
ఈ విద్యాసంవత్సరం ఫీజును రూ.29 వేలకు పెంచారు. వీరందరికీ కలిపి దాదాపు. రూ.4.50 కోట్లు బకాయిలు విడుదల కావాల్సి ఉన్నాయి. కాగా ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ఒక పాఠశాల ఉంది. యేటా 30 మందికి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. వారిలో పలువురు జాయినవ్వడం లేదు. కాగా ప్రస్తుతం 67 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఒక్కో విద్యార్థికి రూ. 30 వేల చొప్పున దాదాపు రూ.54 లక్షల ఫీజు బకాయిలున్నట్లు తెలుస్తోంది. నాలుగేండ్లుగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బకాయిలు రావడం లేదు. దీంతో యాజమాన్యాలు ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో అడ్మిషన్లు ఇచ్చేందుకు నిరాకరించారు.
ఆయా శాఖల అధికారుల చొరవతో ఆయా విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన ట్యూషన్ ఫీజులు విడుదల కాకపోవడంతో ఆయా యాజమా న్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.
బకాయిలను విడుదల చేయాలి
బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌పై దళిత, గిరిజన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. నాలుగేం డ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను విడుదల చేయడం లేదు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి పెరుగుతోంది. బకాయిలను విడుదల చేయాలి. లేదంటే ఎస్‌ఎఫ్‌ఐతో కలిసి ఆందోళనలు చేపడతాం.
లెనిన్, ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు