* ఇందిరాపార్క్ వద్ద కాలేజీ యాజమాన్యాల ధర్నా
ముషీరాబాద్, హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): పదిరోజుల్లో ఫీజు రీయెంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (టీపీడీఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, కార్యదర్శి యాద రామకృష్ణ డిమాండ్ చేశారు.
శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద టీపీడీఎంఏ ఆధ్వర్యంలో యాజమాన్యాలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు నెలలుగా ప్రభుత్వం ఫీజు రీయెంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలను నడపటం భారంగా మారిందని ఆవేదన వ్యక్త చేశారు.
ప్రభుత్వంలోని పెద్దలందర్ని కలిసి విన్నవిస్తే బకాయిలు చెల్లిస్తామని గతేడాది డిసెంబర్ 20న డిప్యూటీ సీఎం తమకు హామీ ఇచ్చారన్నారు. కనీసం 5 శాతం బకాయిలు కూడా చెల్లించలేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము కఠిన నిర్ణయం తీసుకుంటామని, కళాశాలలను నిరవధికంగా మూసేసి పరీక్షలను నిర్వహించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఉపేందర్‌రెడ్డి, సీతారాంరెడ్డి, నాగేందర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, నారాయణగౌడ్ పాల్గొన్నారు.