calender_icon.png 23 November, 2024 | 9:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ కేసులే సవాల్

23-11-2024 01:06:22 AM

  1. కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయాలు అవసరం
  2. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వివాదాలకు సత్వర పరిష్కారం
  3. కామన్‌వెల్త్ మీడియేషన్- ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యా నికి మూలస్తంభం.. కానీ భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారిందని చెప్పారు.

గచ్చిబౌలిలో జరిగిన కామన్ వెల్త్ మీడియేషన్- ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్-2024 కార్యక్రమానికి సుప్రీంకోర్టు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, సీఎం రేవంత్ రెడ్డి, శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి నవాజ్‌తోపాటు పలువురు ముఖ్యఅతిథులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి.. వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమని తెలిపారు. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలని, అలా చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గాలకూ ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) నిర్వాహకులను అభినందిస్తున్నట్లు తెలిపారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదాలను వీలై నంత వేగంగా పరిష్కరించవచ్చునని ఆయన తెలిపారు. ఐఏఎంసీ అనేది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, దేశం మొత్తానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు.

ఐఏఎంసీని గ్లోబల్ ఇన్వెస్టర్స్‌కు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయొద్దని, సామాన్య ప్రజలకు.. చిన్న సంస్థలకు కూడా దాని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ నగరం ఉండటం తమకెంతో గర్వకారణమన్నారు. ఆర్బిట్రేషన్ సేవలపై మరో సదస్సు నిర్వహించాలని సీఎం కోరారు. 

హైదరాబాద్ గ్లోబల్ లీడర్

సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సెన్సైస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్ గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని సీఎం చెప్పారు. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతున్నదని పేర్కొన్నారు.