calender_icon.png 19 April, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి

04-04-2025 01:03:18 AM

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య 

కరీంనగర్,ఏప్రిల్3(విజయక్రాంతి):  వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30 లోగా పరిష్కరించాలని, ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, జిల్లా అధికారులతో ల్యాండ్, ప్రభుత్వ సేవలు, అట్రాసిటీ తదితర అంశాలపై కమిషన్ చైర్మన్, సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  మాట్లాడుతూ వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ఈ నెల 30 లోగా పరిష్కరించాలని అన్నారు. అట్రాసిటీ కేసులు కోర్టులో నిలబడే విధంగా బలమైన సాక్ష్యాలను పోలీసులు సమర్పించి నిందితులకు శిక్షపడేలా చూడాలని కోరారు. కోర్టు స్థాయిలో పెండింగ్లో ఉన్న కేసులపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమీక్షించి త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అన్నారు.

అట్రాసిటీ కేసుల్లో వైద్య ఆరోగ్య శాఖ నుండి పెండింగ్ లో ఉన్న  అవసరమైన వైద్య నివేదికలు వెంటనే పంపాలని ఆదేశించారు.  ఔట్సోర్సింగ్ ఏజెన్సీ లోను ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించినా, ఇతర కార్యక్రమాలకు మళ్లించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఉద్యోగాల భర్తీలో, ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా పాటించాలని, రిజర్వేషన్ రిజిస్టర్ ను తనిఖీ చేస్తామని తెలిపారు.  కరీంనగర్ బాలసదనంలో పెరిగిన అనాధ ఎస్సీ యువతికి వివాహం జరిపించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని, జిల్లా సంక్షేమ అధికారి సబితను ప్రత్యేకంగా అభినందించారు. వివిధ శాఖల వారీగా ఎస్సీ, ఎస్టీ నిధుల కేటాయింపు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలను సమీక్షించారు. 

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీ కిరణ్, ప్రపుల్ దేశాయ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, ఆర్డీవోలు జిల్లా స్థాయి అధికారులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు   పాల్గొన్నారు.