calender_icon.png 11 January, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పెద్దవాగు’ రైతులకు పెద్ద కష్టం!

16-09-2024 12:00:00 AM

  1. భారీ వర్షాలకు ప్రాజెక్ట్‌కు భారీ గండి
  2. వరదల ధాటికి కొట్టుకుపోయిన రింగ్‌బండ్
  3. రూ.3 కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరు
  4. వేలు ఖర్చు పెట్టి పండిస్తున్న పంటలకు అందని సాగునీరు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ‘మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు’ అనే సామెత చందాన ఉంది పెదవాగుప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి. అసలు వ్యవసాయమే జూదమైన వేళ పెద్దవాగుకు గండి పడి సాగునీటికి దిక్కులేకపో వడంతో వారికి సంకట స్థితి వచ్చింది. వేలకు వేలు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాని దుస్థితి నెలకొన్నది. ఇలా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల వరదలకు క్రస్ట్‌గేట్ల వద్ద భారీగా గండి పడింది.

ఇటీవల రూ.3 కోట్ల తో నిర్మించిన రింగ్‌బండ్ సైతం ఇటీవల వరదల్లో గంగపాలైంది. అసలు తూములు సరిచేయకుండా నీరు ఎలా మళ్లిస్తారని ఆయకట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. గతేడాది ప్రాజెక్టు మరమ్మతుల్లో జరిగిన రూ.1.50 కోట్ల అవినీతిపై ఇంజినీర్లపై చర్యలేవని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూలై 17న సంభవించిన విపత్తుకు యావత్తు జలాశయం స్ట్రక్చర్ నిర్వీర్యమైంది.

దీంతో తాత్కాలిక మరమ్మతులకు వెచ్చించిన రూ.3 కోట్ల నిధులు సైతం బూడిదలో పోసిన పన్నీరైంది. గత నెల 31వ తేదీ రాత్రి క్యాచ్‌మెంట్ ఏరియాలో కురిసిన భారీ వర్షాలకు తాత్కాలిక మరమ్మతులు దెబ్బతిన్నాయి. ఈ సమ యంలో ఇలాంటి నిర్ణయాలు సరికావని, ఆ నిధులేవో వరదల్లో నష్టపోయిన రైతులకు అందజేయకుండా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు దోచిపెడుతునట్లు రైతులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. 

పొరపాటు జరిగింది ఇలా..

ఈ సీజన్‌లో కొంత మేరకైనా సాగునీరు అందించాలనే తలంపుతో ప్రభుత్వం రింగ్‌బండ్ నిర్మించాలని నిర్ణయించింది. యుద్ధప్రాతిపదికన పనులు సైతం మొదలయ్యాయి. వాస్తవానికి పనుల డిజైన్ ఏమిటంటే ఎక్కడైతే గండి పడిందో ఆ ప్రాంతంలో అర్ధచంద్రాకారంలో పెద్ద కట్టని కొత్తగా నిర్మించాలి. దాన్ని క్రస్టగేట్‌కు అనుసంధానం చేయాలి. అలా తాత్కాలికంగా జలాశయంలో నీరు నిలిచేలా చేయాలి. ఆ నీటిని తూములకు మళ్లించి తాత్కాలిక ప్రయోజనాలు పొందాల్సి ఉన్నది. కానీ అవేమీ జరగవని రైతులు మొదటి నుంచి వాదిస్తున్నారు. వరదలు, వర్షాల కారణంగా ఆ లక్ష్యం నెరవేరదనేది రైతుల వాదన.

ఇంత చిన్న లాజిక్ మరిచి కేవలం కాంట్రాక్టర్ ప్రయోజనాలు, ఇంజినీర్ల కమీషన్ల కోసం మంచి వర్షాకాలంలో రింగ్‌బండ్ పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జలాశయ పరిధిలోని కుడి, ఎడమ తూములు శిథిలమయ్యా యి. వాటి నుంచి నీరు బయటకు వేళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ నీరు బయటకు వచ్చినా, పారేందుకు సరైన కాలువలు లేవు. ముందు తూములు, కాలువలను సరి చేయకుండా ఇతర పనులు ఎలా చేపడతారని రైతులు వాపోతున్నారు.

మరమ్మతుల మాటేంటి?

అసెంబ్లీ ఎన్నికల ముందు క్రస్టగేట్ల మరమ్మతులంటూ ఖర్చు చేసిన రూ.1.50 కోట్ల సంగతేంటో అధికారులు తేల్చాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా 4.7శాతం ఎక్సెస్‌కు కోట్ చేయడమేంటని, ఆ డబ్బుతో ఏ పనులు చేపట్టారో ఇంజినీర్లు చెప్పాలంటున్నారు. నీటిపారుదలశాఖ ఈఈ, ఏఈలు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై ఆ పనుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. వారి నిర్లక్ష్యంతోనే పెదవాగు భ్రష్టుపట్టిందని, క్రస్ట్‌గేట్ల మరమ్మతులపై సర్కార్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని కోరుతున్నారు. 

ఇచ్చిన హామీలు ఏమాయె..?

పెదవాగు ప్రాజెక్టుకు గండికి కారణమైన నీటిపారుదలశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకొంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రులు ఇచ్చిన హామీ ఏమైందని రైతులు ప్రశ్నిస్తున్నారు. మొదట్లో కొంత హడావుడి చేసిన ప్రభుత్వం తర్వాత పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా ఇరిగేషన్ ఎస్‌ఈ, ఈఈ, డీఈఈ, ఏఈలపై ఎలాంటి చర్యలు తీసుకొన్నారో ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరతున్నారు.

సాగునీరు అందేలా లేదు..

పెదవాగు ప్రాజెక్టు కింద సాగు చేసిన పంటలకు ఈ ఏడాది సాగునీరు అందదు. వేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు చేసి సాగునీరు అందించేందుకు చేపట్టిన రింగ్ బండ్ సైతం వరదలకు కొట్టుకు పోయింది. పనులు నిలిచి పోయాయి. ప్రాజెక్టులో చుక్క నీరులేదు. అధికారులు, నాయకుల మాటలు నమ్మి సాగుచేశాం. నీరులేక వెలవెలబోతున్న పంటలు చూసి కన్నీరు పెట్టుకుంటున్నాం. నేను వరి సాగుకు ఎకరానికి రూ.10 వేలు, పత్తికి ఇప్పటికే ఎకరానికి రూ.20 వేలు ఖర్చు పెట్టాను. పంటను ఎలా కాపాడాలో తెలియడం లేదు.

 గండికోట రామారావు, ఆయకట్టు రైతు

ప్రాజెక్టు ఆధారంగానే సాగు

పెదవాగు ప్రాజెక్టు ఆధారంగా మేం వ్యవసాయం చేస్తున్నాం. ఇక్కడి రైతులెవరికీ బోర్లు, మోటర్లు లేవు. వరదల ధా టికి ప్రాజెక్టు కొట్టుకుపోయింది. తాత్కాలిక పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టు లో చుక్క నీరు లేదు. వేసిన పంటలు చేతికి వస్తాయనే నమ్మకం లేదు. ఈ ఏడాది రైతులకు కరువు కాలం తప్పదు. నాట్లు వేసి నీరు కోసం ఎదురు చూస్తున్నాం. ప ంటలకు తడులు ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదు. 

సాయిల శ్రీను, రైతు, గుమ్మడివెళ్లి

30 మీటర్ల మేర కట్ట కొట్టుకుపోయింది

సాధారణంగా సెప్టెంబర్‌లో ఎప్పుడూ వరదలు రావు. కానీ అనుకోకుండా వరదలు వచ్చాయి. పెద్దవాగు పరిధిలో 30 మీటర్ల మేర కట్ట కొట్టుకుపోయింది. ప్రాజెక్టుకు తాత్కాలిక మరమ్మతులు చేయిస్తాం. 200 మీటర్ల పొడవుతో బండ్ నిర్మిస్తున్నాం. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసి పంటలకు సాగునీరు అందిస్తాం.

శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ