04-04-2025 11:01:44 PM
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఫస్ట్‌షాట్ పేరుతో ఈ గ్లింప్స్‌ను ఏప్రిల్ 6న ఉదయం 11.45 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ‘ఫస్ట్‌షాట్’ విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తుది మిక్సింగ్ పనిని శుక్రవారం పూర్తిచేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం.. అంటే మొత్తం ఐదు భాషల్లో గ్లింప్స్ విడుదల కానుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్నారు.