భద్రాద్రి: ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడింది. గురువారం గండిపడి నీళ్లన్నీ దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడినట్లు అధికారులు తెలిపారు. పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగి వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి వేల ఎకరాల్లోని పంట నాశనం అయింది. వదర దాటికి పలు గ్రామాల ప్రజలు కొండలు, ఎత్తయిన భవనాల్లో రాత్రంతా తలదాచుకున్నారు. రాత్రి సమయంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు పరులుగు తీశారు.
ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం, కరీంనగర్, భూపాలపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ వెల్లడించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు హెచ్చరించారు.