calender_icon.png 25 November, 2024 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పత్తిపాక’తో పెద్దపెల్లి రైతుకు మేలు

25-11-2024 02:04:52 AM

  1. టెయిల్ ఎండ్ ప్రాంతాల ఆయకట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం
  2. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

పెద్దపల్లి, నవంబర్ -24 (విజయక్రాంతి): పత్తిపాక రిజర్వాయర్‌తో పెద్దపెల్లి రైతాంగానికి మేలు జరుగుతుందని, టెయిల్ ఎండ్ ప్రాంతాల ఆయకట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో నిర్మించనున్న రిజర్వాయర్ స్థలాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్‌లతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు.

అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన స్థలం, భూ సేకరణ ప్రతిపాదనలు, ఇతర అంశాలతో కూడిన డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నామని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్‌తో జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందన్నారు. 2 లక్షల 40 వేల ఎకరాల స్థిరీకరణతో పాటు నూతనంగా 10 వేల ఎకరాల ఆయకట్టు వస్తుందని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో అధిక లాభం సమకూరే విధంగా ప్రభుత్వం పని చేస్తుం దన్నారు. గతంలో కూడా జిల్లాకు ఆయకట్టు అందించే ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఎల్లంపల్లి, వరద కాలువ, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాం ప్రాజెక్టులను తమ హయాంలోనే నిర్మించామని తెలిపారు.

పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యేలు అడ్లూరు లక్ష్మణ్‌కుమార్, చింతకుంట విజయ రమణారావు, మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రైతుల చిరకాల ఆకాంక్ష  పత్తిపాక రిజర్వాయర్‌తో నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.

రైతులతో సంప్రదింపులు జరిపి ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రభుత్వం ముందుకు వెళ్తామన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులె అత్యధికంగా వరి సాగు చేసి ఉత్పత్తి సాధించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ప్రతి బస్తాకు నాలుగు నుంచి ఐదు కేజీలు తరుగు పేరుతో మోసం చేశారని, తమ ప్రజా ప్రభుత్వం రాగానే తరుగు లేకుండా పూర్తి స్థాయి పంట కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.

ఆర్థిక వనరులను సమకూరుస్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని వెల్లడించారు. ధర్మపురి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ప్రభుత్వంతో మాట్లాడి యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలను మంజూరు చేయించారని తెలిపారు. వారి నియోజకవర్గ పరిధిలో ఆసుపత్రులు, పాఠశాలలు, రోడ్ల నిర్మాణ పనులకు ప్రత్యేక కృషి చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డీ వేణు,  రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య పాల్గొన్నారు.