calender_icon.png 24 September, 2024 | 7:50 AM

అక్రమార్కుల చెరలో పెద్దచెరువు

09-09-2024 12:08:46 AM

  1. ఇబ్రహీంపట్నానికే ఐకాన్ ఈ తటాకం 
  2. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో దర్జాగా ఆక్రమణలు 
  3. పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని అతి పెద్ద చెరువుల్లో ఇబ్రహీంపట్నం చెరువు ఒకటి. ఆ చెరువు ఇప్పుడు అక్రమార్కుల చెరలో చిక్కుకున్నది. చెరువు  సుమారు 1,400 ఎకరాల్లో 50 ఫీట్ల లోతులో 0.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో విస్తరించి ఉండగా, కొందరు అక్రమార్కుల కబ్జాతో రోజురోజుకూ కుంచించుకపోతున్నది. చెరువు పరిధిలో 1,700 ఎకరాల ఆయకట్టు ఉంది. 1550 మధ్య ఇబ్రహీం కుతుబ్‌షా చెరువును తవ్వించారు. చెరువు సుమారు మూడు వేల మత్సకారుల కుటుంబాలకు ఆదెరువు.

ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారులు చెరువులు, కుంటలు శిఖంపై కన్నేశారు. దీనిలో భాగంగానే ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కబ్జాకు తెరతీశారు. రాజకీయ నేతలు, అధికారుల అండదండలతో ఏకంగా చెరువు హద్దురాళ్లనే మార్చి ప్లాట్లు వేశారు. ఇలా ఇంద్రారెడ్డి నగర్, బృందావన్ కాలనీల్లో కొంత భాగం, ఇబ్రహీంపట్నం, ఉప్పరిగూడ సమీపంలో అక్రమ కట్టడాలు వెలిశాయి.

ఫిరంగి కాలువ కబ్జా..

రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువులు, కాల్వలు, కుంటలు నాలాల పరిధిలోని వందలాది ఎకరాలను కబ్జా చేశారు. ఆదిబట్ల, కొంగరకలాన్, మంగళ్‌పల్లి, ఉప్పరి గూడ ప్రాంతాల్లో సుమారు 16 కి.మీ ఫిరంగి కాల్వ కబ్జాకు గురైంది. అక్రమార్కులు మట్టి, రాళ్లతో నింపి కాల్వ విస్తీర్ణాన్ని కుదించి, కాల్వ స్థలంలో ప్లాట్లు వేసి అమాయక ప్రజలకు కట్టబెడుతున్నారు. వేలాది ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ ఫిరంగి, పెద్ద కాలువ నేడు కాలగర్భంలో కలిసిపోతుంది.

కాలువ పూడుకపోకముందు వేలాది ఎకరాలకు సాగునీరు అందించినా ప్రస్తుతం ఫిరంగి కాలువకు రియల్ ఎస్టేట్ దెబ్బ తగిలింది. ఇంత జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని స్థానికులు మండిపడుతున్నారు. పెద్ద చెరువు కబ్జాపై ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా వారు సమాధానాలను దాటవేశారు.

హైడ్రా అంతటా రావాల్సిందే..

ఇబ్రహీంపట్నం చెరువు ఎఫ్‌టీఎల్‌లో అక్రమార్కులు పోసిన మట్టిని తొలగించాలి. చెరువు పరిధిలో రెవెన్యూశాఖ సర్వే చేపట్టి హద్దురాళ్లు ఏర్పాటు చేయాలి. చెరువును కబ్జా చెర నుంచి కాపాడాలి. హైదరాబాద్‌లో హైడ్రా అకమ కట్టడాలు కూల్చివేస్తుండడం హర్షణీయం. హైడ్రా వంటి వ్యవస్థే అన్నిచోట్లకూ రావాలి. అక్రమ కట్టడాలు కూల్చివేయాలి. అలా అయితేనే అక్రమార్కులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ జోలికివెళ్లరు.

మడుపు వెంకటేష్, స్థానికుడు, ఇబ్రహీంపట్నం

చర్యలు తీసుకుంటాం

నేను మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకోకముందే పెద్ద చెరు వు కబ్జా జరిగింది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లకు హద్దులను మార్కింగ్ చేస్తే.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఎన్ని నిర్మాణాలు జరిగాయి?  అనే అంశాన్ని పరిశీలిస్తాం. హైడ్రా నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటాం.

 రవీందర్ సాగర్, మన్సిపల్ కమిషనర్, ఇబ్రహీంపట్నం