18-03-2025 07:35:51 PM
బీసీ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): నేరస్థులకు అండగా ఉంటూ, అరచకాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలంగాణ పోలీస్ శాఖకు మాయని మచ్చ అని, అతనిని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పెబ్బేరు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి ఖాకీ డ్రస్ వేసుకొని క్రిమినల్ పనులు చేస్తున్నాడని, ఆయన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని, దొంగల ముఠాను ఏర్పాటు చేసుకొని దొంగతనాలు చేయించి అందులో వాటాలు తీసుకుంటున్నారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయన్నారు.
ఓ చోరీ కేసులో రికవరీ చేసిన బంగారాన్ని కోర్టులో డిపాజిట్ చేయకుండా బాధితులకు ఫోన్ పే ద్వారా డబ్బులు వేసిండని, కోర్టులో అన్నీ డిపాజిట్ చేయము, కొన్నే చేస్తాము అని బాధితులను బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నాడని, దీనికి సంబంధించి కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయన్నారు. అదేవిధంగా నిందితుల నుంచి బాధితుల నుంచి ఇలా రెండు వైపుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనల దృష్ట్యా తెలంగాణ డీజీపీ గారికి పెబ్బేరు ఎస్సై అరాచకాలు, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈ నెల 12 న ఫిర్యాదు చేశామన్నారు. డీజీపీ కలుగజేసుకొని వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షులు దేవర శివ, బాధితులు ఎల్లయ్య, శ్రీశైలం యాదవ్, రాజ గౌడ్, విష్ణు వర్ధన్, మధుసూదన్ పాల్గొన్నారు.