calender_icon.png 16 November, 2024 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు ఉద్యమం పీటముడి

25-07-2024 12:00:00 AM

సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలంగా జరుగుతున్న రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళన చేస్తున్న రైతులకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం లోపించినట్లు కనిపిస్తున్నదని అభిప్రాయపడింది. వారి డిమాండ్ల పరిష్కారానికి ఓ స్వ తంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ కమిటీలో ఓ తటస్థ అంపైర్ లాంటి వ్యక్తి ఉండాలని అభిప్రాయపడింది. శంభూ సరిహద్దు పరిస్థితులపై హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘రైతు ల సమస్యలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. లేదంటే, వాళ్లు ఎందుకు రావాలని అనుకొంటారు? ఇక్కడి నుంచి మీరు కొందరు మంత్రులను పంపిస్తున్నారు కానీ, మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కనిపిస్తున్నది.

ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలు, ప్రభుత్వం మధ్య విశ్వాసం కల్పించే ఓ తటస్థ అంపైర్ కావాలి. అలాంటి వ్యక్తిని మీరు ఎందుకు పంపడం లేదు?’ అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. అంతేకాదు, రైతుల సమస్యల పరిష్కారానికి ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలనికూడా కోర్టు ప్రతిపాదించింది. దీనిపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన కోర్టు అప్పటిదాకా శంభూ సరిహద్దువద్ద యథాతథ స్థితిని కొనసాగించాలని, బారికేడ్లు తొలగించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. రైతుల ఉద్యమం సందర్భంగా గతంలో అంబాల సమీపంలోని శంభూ సరిహద్దువద్ద హర్యానా ప్రభుత్వం అడ్డుకట్టలను ఏర్పాటు చేసిం ది.

అవి అప్పటినుంచి అలాగే కొనసాగుతున్నాయి. వాటిని వారం రోజల్లోగా తొలగించాలని ఇటీవల పంజాబ్- హర్యానా హైకోర్టు ఆదేశిం చింది. దీన్ని సవాలు చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, వెంటనే జాతీయ రహదారిని తెరవాలని ఆదేశించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. శంభూ సరిహద్దును తెరిచిన వెంటనే ఢిల్లీకి పాదయాత్ర చేపడతామని పంజాబ్ రైతులు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు, ఆగస్టు 15న ఢిల్లీలో భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టాలని, ఇందులో దేశం నలుమూలల నుంచీ రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, దానికి చట్టభద్రత కల్పించాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కేంద్రం కొత్తగా తెచ్చిన మూడు వివాదాస్పద చట్టాలను రద్దు చేయడంతోపాటు పలు డిమాండ్ల సాధనకు రైతులు దాదాపు ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దుల్లోనే తిష్ఠ వేసి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. 2020 నవంబర్‌లో వేలాదిమంది రైతులు దిల్లీ చలో నినాదంతో ఆందోళన ప్రారంభించగా, ఢిల్లీతోపాటు శంభు సరిహద్దువద్ద కేంద్రం, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో రైతులు దాదాపు ఏడాదిపాటు అక్కడే బైఠాయించి ఆందోళన జరిపారు.

ఆ సందర్భంగా కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధరసహా రైతుల డిమాండ్లను నెరవేర్చడానికి హామీ ఇచ్చింది. అనేక దఫాల చర్చల అనంతరం 2021 డిసెంబర్ 9న నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రక టించడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇది జరిగి రెండున్నరేళ్లు గడిచినా రైతులకు ఇచ్చిన హామీల్లో కొన్నిటినే కేంద్రం నెరవేర్చింది. ప్రధానంగా పంటలకు చట్టబద్ధ కనీస మద్దతు ధరలకు సంబంధించి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో మరోసారి ఉద్యమానికి రైతులు సిద్ధమవుతున్నారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని వారు కలిశా రు. కనీస మద్దతు ధరలకు సంబంధించి పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రతిపాదించాలని వారు ఆయనను కోరారు.